రద్దయిన పాత నోట్లను కొత్తగా మార్చే స్వామిజీ!
Mulugu News: పాత కరెన్సీ, దొంగనోట్లను ఓ స్వామీజి కొత్తగా మారుస్తాడని నమ్మిన ఓ ముఠా 1.65 కోట్ల డబ్బు పట్టుకుని యూపీకి బయలు దేరారు. కానీ వాహన తనిఖీల్లో ములుగు పోలీసులకు చిక్కి ఎనిమిది మంది అరెస్టయ్యారు.
Mulugu News: రద్దు అయిన పాత నోట్లను కొత్త కరెన్సీగా స్వామిజీ మారుస్తారని నమ్మిన ఓ ముఠా.. అక్రమంగా తరలిస్తున్న 1.65 కోట్ల రూపాయల పాత కరెన్సీని ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువ అయిన పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్లు, 5 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే స్వామిజీ!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేశవాపూర్‌కు చెందిన పప్పుల నాగేంద్ర బాబు చాలా అప్పులు చేశాడు. అవి తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే వాటిని తీర్చేందుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనుకున్నాడు. అందుకోసం చాలా రీసెర్చ్ కూడా చేశాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడైన కోదాడ మండలం సాలర్జింగ్‌పేటకు చెందిన శ్రీరాముల నాగేశ్వర రావు అలియాస్ నాగలింగేశ్వర బాబును కలిసి విషయం చెప్పాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని నాగలింగేశ్వర బాబు.. నాగేంద్ర బాబుకు చెప్పాడు. నిజంగానే వస్తాయంటూ నమ్మించాడు. అయితే నాగేంద్ర బాబు వద్ద పాత కరెన్సీ లేదు. ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తూనే.. పాత కరెన్సీని రాబట్టేందుకు తెగ ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు హైదరాబాద్‌కు చెందిన వెంకటరెడ్డి, నవీన్ రెడ్డికి రూ. 5 లక్షలు ఇచ్చి వారి నుంచి దాదాపు రూ. 2 కోట్ల విలువైన రద్దయిన పాత కరెన్సీ, దొంగనోట్లను కొనుగోలు చేశాడు. ఎలాగైనా సరే వాటిని ఆ స్వామీజి వద్దకు తీసుకెళ్లి కొత్త నోట్లుగా మార్చుకొని అప్పులన్నీ తీర్చేసి హాయిగా బతకాలనుకున్నాడు. ఇదే విషయాన్ని మిత్రుడికి చెప్పి ఉత్తర్‌ప్రదేశ్ కు వెళ్లేందుకు పయనం అయ్యారు.
వాహన తనిఖీల్లో పట్టివేత
తన ఉద్ద ఉన్న పాత కరెన్సీతోపాటు దొంగనోట్లను మూట కట్టి కారులో పెట్టాడు. నాగేంద్రబాబు, నాగ లింగేశ్వరతో పాటు భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్య నారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డి శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధానగర్ కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గంటా యాదగిరి, మలక్ పేట బ్యాంక్ కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్ సింగ్, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా కలిసి డబ్బుతో సహా భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గ మధ్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
నాగేంద్ర బాబు ఉన్న కారును కూడా తనిఖీ చేయగా.. కారులో పాత కరెన్సీ కట్టలతో పాటు దొంగ నోట్లు కూడా ఉన్నాయి. వెంటనే పోలీసులు కారులో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్లు, రూ. 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.