Name Change Gazette: ముద్రగడలా మనమూ పేరు మార్చుకోవచ్చు, లీగల్ ప్రాసెస్ ఇదే - ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
Mudragada Name Change: ముద్రగడలా మనమూ పేరు మార్చుకోవాలంటే లీగల్‌గా ఓ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి.
How To Change Name Legally: "పిఠాపురంలో పవన్‌ని ఓడిస్తానని సవాల్ చేశా. ఓడిపోయా. ఇప్పుడు నా పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నా. పేరు మార్చాలని గెజిట్ అప్లికేషన్ పెట్టుకుంటా". ఓటమిని అంగీకరిస్తూ ముద్రగడ చెప్పిన మాటలివి. కాసేపు ఈ రాజకీయాల సంగతి పక్కన పెడితే..పేరు మార్చుకోవడమే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఎవరైనా సరే పేరు నచ్చకపోతే మార్చుకోవచ్చు. కానీ అదేదో స్పెలింగ్ మార్చుకున్నంత సులభం కాదు. దానికంటూ ఓ ప్రాసెస్ (Name Change Process) ఉంటుంది. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సిందే. అప్పుడు కానీ పేరు మారదు. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఇలాగే పేర్లు మార్చుకున్నారు. వాళ్లంతా అఫీషియల్‌గా అప్లై చేసుకుని పేర్లు మార్చుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కచ్చితంగా ఉంటుంది. రూల్స్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. నచ్చిన పేరు పెట్టుకోవాలనుకున్నా, స్పెలింగ్‌లో మార్పులు చేయాలన్నా, మతం మార్చుకున్నా, జెండర్ మార్చుకున్నా, జ్యోతిషం ప్రకారం పేర్లు మార్చుకోవాలనుకున్నా లీగల్‌గా వెళ్లాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..
1. అఫిడవిట్
2. పేరు మార్చుకుంటున్నట్టుగా న్యూస్‌పేపర్‌లో పబ్లిష్ చేసిన క్లిప్పింగ్స్
3. పేరు మార్చుకోడానికి ఓ డీడ్
4. సెక్రటేరియట్‌కి పెట్టుకున్న రిక్వెస్ట్ లెటర్
5. సెక్రటేరియట్ ఇచ్చిన రిప్లై లెటర్
6. గెజిట్ నోటిఫికేషన్
పేరు ఎలా మార్చుకోవాలి..?
పేరుతో పాటు పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్ (Name Change Affidavit) తయారు చేసుకోవాలి. అందులోనే ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో మెన్షన్ చేయాలి. ఈ అఫిడవిట్‌పై ఇద్దరు సాక్షులు సంతకం పెట్టాలి. స్టాంప్ పేపర్‌పై ఈ అఫిడవిట్‌ని ప్రింట్ చేయించాలి. ఆ తరవాత నోటరీకి వెళ్లి దాన్ని నోటరైజ్ చేసుకోవాలి. దీనిపై ఇద్దరు గెజిట్ ఆఫీసర్‌లు సంతకాలు పెట్టాలి. లీగల్‌గా పేరు మార్చుకుంటున్నట్టు ఏదైనా న్యూస్‌పేపర్‌లో యాడ్ ఇవ్వాలి. ఆ తరవాతే Name Change Gazette ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అధికారికంగా గెజిట్ వచ్చిందంటే పేరు మారిపోయినట్టే. అప్పటి నుంచి మారిన పేరే అధికారికంగా చెలామణి అవుతుంది. అయితే...ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్లు ఈ ప్రాసెస్ అవసరం లేదు. కానీ...పేరు మారినట్టు అధికారికంగా ఓ రుజువు ఉండాలంటే మాత్రం గెజిట్ తప్పనిసరి.
గెజిటన్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఇదే..
పేరు మార్చుకోడానికి అవసరమైన డీడ్‌ని గెజిట్ నోటిఫికేషన్‌లు జారీ చేసే విభాగంలో సబ్మిట్ చేయాలి. Department of Publication, Civil Lines, Delhi-110054కి ఈ డాక్యుమెంట్స్‌ని పంపాలి. దీంతో పాటు లెటర్ ఆఫ్ డిక్లరేషన్ కూడా తీసుకెళ్లాలి. న్యూస్ పేపర్స్‌లో పబ్లిష్ అయిన క్లిప్పింగ్స్‌నీ పట్టుకెళ్లాలి. రెండు ఫొటోలు, ఫొటో ఐడీ అంటే పాన్ లేదా ఆధార్ కార్డ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేసిన తరవాత అఫీషియల్ గెజిట్‌లో పేరు మార్చుతూ అధికారికంగా ప్రభుత్వం పబ్లిష్ చేస్తుంది. ఈ ప్రక్రియకి రూ.700-900 వరకూ ఖర్చవుతుంది. పోస్టల్ లేదా డీడీ లేదా నగదు రూపంలో ఈ రుసుముని చెల్లించవచ్చు.
Also Read: BJP Failure in UP: యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ దూకుడుకి బ్రేక్‌లు, ఎక్కడ బెడిసి కొట్టింది?