Mpox Outbreak: పాకిస్థాన్‌లో తొలి Mpox కేసు నమోదు, ఇండియాకీ ముప్పు పొంచి ఉందా?
Mpox Virus: ఇన్నాళ్లూ ఆఫ్రికన్ దేశాలకే పరిమితమైన Mpox కేసులు ఇప్పుడు అన్ని చోట్లా వ్యాప్తి చెందుతున్నాయి. పాకిస్థాన్‌తో పాటు స్వీడెన్‌లోనూ కేసులు నమోదయ్యాయి.
Mpox Cases: ప్రపంచవ్యాప్తంగా మరోసారి Mpox కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 70కి పైగా దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే...ఆ కేసులన్నీ ఆఫ్రికా దేశాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు మిగతా చోటా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్‌తో పాటు స్వీడెన్‌లో mpox కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో 34 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఈ వ్యక్తి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు తెలిసింది. బాధితుడితో సన్నిహితంగా ఉన్న వాళ్ల కోసం ఆరా తీస్తున్న అధికారులు వాళ్లకీ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అంతే కాదు. బాధితుడు వచ్చిన ఫ్లైట్‌లో తోటి ప్రయాణికుల వివరాలూ అడిగి తెలుసుకుంటున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ పాకిస్థాన్‌లో 11 Mpox కేసులు నమోదయ్యాయి. వీళ్లలో ఒకరు మృతి చెందారు. అటు స్వీడెన్‌లోనూ స్టాక్‌హామ్‌లోని ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఆఫ్రికా ఖండంలో కాకుండా బయటి దేశాల్లో నమోదైన తొలి కేసు ఇదే. త్వరలోనే ఐరోపా దేశాలకూ ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఇప్పటికే WHO హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి నుంచే mpox కేసులు పెరుగుతున్నాయి. కాంగోలో ఇప్పటి వరకూ 548 మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షణాలు ఇవే..
ఈ Orthopoxvirus కాంగోలోని రిలీఫ్ క్యాంప్‌లలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అక్కడి నుంచి ఉగాండా, ర్వాండా, కెన్యా, బురుండి దేశాలకు సోకింది. సౌతాఫ్రికాలోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. అయితే...ఇక్కడ వేరే వేరియంట్ వ్యాప్తి చెందుతోందని అక్కడి అధికారులు వెల్లడించారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్...మనుషుల నుంచి మనుషులకు చాలా వేగంగా సోకుతుంది. ముఖ్యంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి నిండా దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దాదాపు 2-4 వారాల పాటు ఈ వైరస్ శరీరంలో ఉంటోంది.
భారత్‌లోనూ వ్యాప్తి చెందుతుందా..?
clade Ib వేరియంట్ వైరస్ భారత్‌లోనూ వ్యాప్తి చెందుతుందా అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటికే కేరళలో ఓసారి అలజడి సృష్టించింది. 2022లో clade IIb వేరియంట్ ఇండియాలో వెలుగు చూసింది. clade Ib తో పోల్చి చూస్తే ఇది కాస్త తక్కువ ప్రమాదకరం. అయితే...అది కేరళకే పరిమితమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దాదాపు 22 కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి మరీ ప్రమాదకరంగా అయితే ఎక్కడా కేసులు నమోదు కాలేదు. కానీ...అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని WHO స్పష్టం చేసింది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు, మహిళలకు ఇది ఎక్కువగా సోకుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆఫ్రికన్ దేశాల్లో బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. రోగనిరోధక శక్తిని ఛేదించి మరీ ప్రాణాలు తీస్తోందీ వైరస్.