Morbi Bridge Collapse: మోబ్రి బ్రిడ్జ్ కూలిన ఘటనలో 9 మంది అరెస్ట్, విచారణ వేగవంతం
Morbi Bridge Collapse: మోబ్రి వంతెన కూలిన ఘటనలో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు.
Morbi Bridge Collapse:
కొనసాగుతున్న విచారణ..
గుజరాత్‌లో మోబ్రి వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లపై పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. సమగ్ర విచారణ కొనసాగుతోంది. మేనేజర్, సూపర్‌వైజర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన సిబ్బంది అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే ఓ అధికారి సంచలన విషయం వెల్లడించారు. ఈ వంతెనను మరమ్మతు చేయించాక ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితులు సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే ఈ వంతెనను ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న కంపెనీపైనా FIR నమోదు చేశారు పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
— CMO Gujarat (@CMOGuj) October 31, 2022
మోర్బీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం తక్షణమే బృందాలను సమీకరించాలని ఆయన ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా, నిరంతరం పర్యవేక్షించాలని.. బాధిత ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రధాని కోరారు. దీనితో పాటు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రధాన మంత్రి సహాయ నిధి (PMNRF) నుండి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
140 ఏళ్ల చరిత్ర..
మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెనది 140 ఏళ్ల చరిత్ర. గుజరాత్‌లో అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణల్లో ఇదీ ఒకటి. రోజూ వందలాది మంది వచ్చి ఈ బ్రిడ్జ్‌ను సందర్శిస్తుంటారు. రిషికేష్‌లోని రామ్, లక్ష్మణ్ ఊయల వంతెనను పోలి ఉండటం వల్ల చాలా మంది దీన్ని చూసేందుకు వస్తుంటారు. ఒక్కోసారి పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆదివారం కావటం వల్ల నిన్న ఎక్కువ మంది వచ్చారు. వందల మంది వంతెనపైకి ఎక్కారు. కెపాసిటీకి మించి పోవటం వల్ల ఉన్నట్టుండి అది కూలిపోయింది. వంతెనపై ఉన్న వాళ్లంతా నదిలో పడిపోయారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినా...కొందరు మాత్రం గల్లంతయ్యారు. ఈ బ్రిడ్జ్‌ను 1880లో నిర్మించారు. అప్పటి ముంబయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణానికి అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు. ఇందుకు అవసరమైన సామగ్రి అంతా బ్రిటన్ నుంచి తెప్పించారు. నిర్మాణం పూర్తైనప్పటి నుంచి ఇప్పుడీ ప్రమాదం జరిగినంత వరకూ ఎన్నో సార్లు ఈ వంతెనకు మరమ్మతులు చేశారు. మరమ్మతుల కారణంగా దాదాపు 6 నెలల పాటు వంతెనను మూసివేశారు. అక్టోబర్ 25వ తేదీన బ్రిడ్జ్‌ను తెరిచారు.
ఈ ఆర్నెల్లలో రూ.2 కోట్ల ఖర్చుతో వంతెనకు మరమ్మతులు చేయించారు.
Also Read: Twitter Blue Verification Badge: ట్విటర్ యూజర్స్‌కు మరో షాక్, బ్లూ టిక్ కోసం డబ్బులు కట్టాలట?