Minority Status for Hindus: మాకు సమయం కావాలి, ఇది చాలా సున్నితమైన అంశం - హిందువులను మైనార్టీలుగా గుర్తించడంపై కేంద్రం
Minority Status for Hindus: హిందువులకు మైనార్టీ గుర్తింపు ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.
Minority Status for Hindus:
రాష్ట్రాలు సమయం కోరుతున్నాయ్..
హిందువుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వారిని "మైనార్టీలు"గా గుర్తించాలన్న అంశం సుప్రీం కోర్టులో విచారణకు రాగా..కేంద్రం ఇందుకోసం కొంత సమయం కావాలని కోరింది. "ఇది చాలా సున్నితమైన అంశం. ఏ నిర్ణయం తీసుకున్నా..దీర్ఘకాలిక ప్రభావాలు ఎదుర్కోక తప్పదు" అని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్‌లు రాగా...కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ 14 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ డిమాండ్ తమకు వచ్చిందని ఆ అఫిడవిట్‌లో కేంద్రం వివరించింది. ఈ అంశంలో పిటిషనర్లు TMA Pai కేసులో 2002 నాటి సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తున్నారు. హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని కోరుతూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం ఇలా స్పందించింది. ఇప్పటికే మూడు సార్లు అఫిడవిట్ దాఖలు చేసిన మోదీ సర్కార్.. ఈసారి నాలుగో అఫిడవిట్‌ను సమర్పించింది. మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, లక్షద్వీప్, పంజాబ్, లద్దాఖ్, కశ్మీర్ తదితర రాష్ట్రాల్లోని హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే..ఈ అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని గతంలో తెలిపిన కేంద్రం...అందుకు సమయం కావాలని స్పష్టం చేస్తోంది.
ఈ అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాలతో చర్చించినట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. "రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఆయా రాష్ట్రాల హోం మంత్రిత్వ శాఖలతో, న్యాయ శాఖలతో చర్చలు జరిగాయి. వీటితో పాటు National Commission for Minorities (NCM), National Commission for Minority Educational Institutions (NCMEI)తోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి" అని తెలిపింది. అయితే...కొన్ని రాష్ట్రాలు తమకు ఇంకా సమయం కావాలని కోరినట్టు కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. హడావుడిగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదని తెలిపింది. ఇప్పటికే...పంజాబ్, మిజోరం, మేఘాలయా, మణిపూర్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, తమిళనాడు, యూపీ సహా లద్దాఖ్, దాద్రా అండ్ నగర్ హవేలి, దామన్ అండ్ దియూ, ఛండీగఢ్ ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
వాదనలు..
మొత్తం 19 రాష్ట్రాల ప్రభుత్వాలకు దీనిపై రిమైండర్ పంపామని, వీలైనంత త్వరగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని చెప్పామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. న్యాయస్థానం ఇంకాస్త సమయం ఇస్తే తప్ప ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను వెల్లడించలేవని అభిప్రాయపడింది. "మైనార్టీ" అనే పదానికి సరైన నిర్వచనం లేదన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో...పిటిషనర్ ఉపాధ్యాయ్ కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చారు. 1993లో అక్టోబర్ 23న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రస్తావించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు,
పార్శీలను మైనార్టీలుగా ఎలా నోటిఫై చేశారని ప్రశ్నించారు. ఉపాధ్యాయ్ తరపున న్యాయవాది వికాస్ సింగ్ అప్పటి కన్సల్టేషన్ ప్రాసెస్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. అంతే కాదు. TMA Pai కేసు తరవాత కేంద్రం ప్రస్తుతం అనుసరిస్తున్న కన్సల్టేషన్ ప్రాసెస్‌తో ఇచ్చే "మైనార్టీ" హోదాకు కచ్చితత్వం ఉండదని వ్యాఖ్యానించారు.
Also Read: Munugode ByPoll: టీఆర్ఎస్ నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం - మరోచోట రూ. 94 లక్షలు పట్టివేత