Minister Seethakka: నన్ను అలా పిలవకండి - అధికారులకు మంత్రి సీతక్క రిక్వెస్ట్
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని జామిని గ్రామంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పర్యటించారు.
Seethakka in Hyderabad: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారుల పట్ల వ్యవహరించిన విధానం వారిని ఆకట్టుకుంది. గ్రామసభలో పాల్గొన్న మంత్రిని కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులంతా మేడం.. మేడం.. అని పిలుస్తుండగా.. మేడమ్ అని కాదు అక్కా అని పిలవండి అని మంత్రి వారికి సూచించారు. తాను ఇప్పటికీ ఎప్పటికీ మీ సీతక్కనే అని మంత్రి చెప్పారు.
‘‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం... మేడం అంటే దూరం అయిపోతా. అదే గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లిలాగా కలిసి పోతా. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే ముఖ్యం. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పండి. వాటిని తీర్చడానికే మేం ఉన్నాం’’ అని మంత్రి సీతక్క అధికారులతో చెప్పారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని జామిని గ్రామంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పర్యటించారు. జామిని గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్కను గ్రామస్తులు డోలు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. స్థానిక కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీతక్క.. ఆపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆమె దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రజాపాలనతో సమస్యలను పరిష్కారం చేసే దిశగా అందరికీ సంక్షేమ పథకాలు అందించేలా జిల్లా ఇన్చార్జి మంత్రిగా తన వంతు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క గ్రామస్తులతో కలిసి ఆనందంగా గడిపారు.