Microsoft Layoffs 2023: మైక్రోసాఫ్ట్ కూడా మొదలెట్టేసింది, వేలాది మంది ఉద్యోగులకు గుడ్‌బై
Microsoft Layoffs 2023: మైక్రోసాఫ్ట్ కంపెనీ 11వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.
Microsoft Layoffs 2023:
ఆ విభాగాల్లో...
మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా లేఆఫ్‌లు మొదలు పెట్టింది. HR సహా ఇంజినీరింగ్ విభాగంలో వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమవు తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5% మేర ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే అమెజాన్, మెటా భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కుదుపుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్యోగులను తొలగించక తప్పడం లేదని చెబుతున్నాయి టెక్ సంస్థలు. మైక్రోసాఫ్ట్ సంస్థ...దాదాపు 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. Reuters న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే విషయం వెల్లడించింది. ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువ మొత్తంలో లేఆఫ్‌లు ఉండనున్నాయి. గతేడాది కన్నా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. అయితే...ఎప్పటి నుంచి ఈ లేఆఫ్‌లు మొదలు పెడతారన్నది క్లారిటీ ఇవ్వకపోయినా...వచ్చే వారం నుంచి మొదలవుతాయని సమాచారం. ఇప్పటికి ఉన్న లెక్కల ప్రకారం..మైక్రోసాఫ్ట్ కంపెనీలో 2 లక్షల 21 వేల మంది ఉద్యోగులు న్నారు. వీరిలో లక్షా 22 వేల మందికి పైగా అమెరికాలోనే ఉన్నారు. ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు లేకపోవడం వల్ల కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. చిన్న స్థాయి ఉద్యోగులను గతేడాదే తొలగించారు. దాదాపు వెయ్యి మందిని ఇంటికి పంపేసింది. ఇటీవలే CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. "దాదాపు రెండేళ్ల పాటు టెక్ ఇండస్ట్రీస్‌కి సవాళ్లు తప్పవు" అని అన్నారు.
అమెజాన్‌లోనూ..
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిన ఈ సంస్థ...మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్‌లకు సిద్ధమవుతోంది. అంతకు ముందు కన్నా ఎక్కువ మొత్తంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం...గతేడాది నవంబర్ నుంచి ఈ కోతలు కొనసాగుతున్నాయి. అయితే...మరో 10 వేల మందిని తొలగించనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ...ఇప్పుడా సంఖ్య ఏకంగా 18 వేలకు పెరిగింది. సంస్థ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా...కచ్చితంగా ఇంత మందని తొలగిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని సియాటెల్‌లోని కంపెనీలో దాదాపు 10 వేల మందిని తొలగించేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకుంది అమెజాన్. రిటెయిల్, హెచ్‌ఆర్ విభాగంలోని ఉద్యోగులను ఇంటికి పంపనుంది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. అప్పుడు వేలాది మంది ఉద్యోగులను అదనంగా రిక్రూట్ చేసుకుంది కంపెనీ. అయితే...ఇప్పుడు బిజినెస్ డల్ అవడం వల్ల వారి అవసరం లేదని భావిస్తోంది. అందుకే....క్రమంగా
వారిని తొలగిస్తూ వస్తోంది. గతేడాది లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు 16 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 18 వేల మందిని తొలగిస్తారని తెలుస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఉద్యోగం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే...ఇలా ఉన్నట్టుండి పంపుతున్నందుకు పరిహారం కూడా చెల్లిస్తోంది కంపెనీ.