ప్రధాని పదవికే మచ్చ తెచ్చారు, ప్రసంగాల్లో మరీ అంత విద్వేషమా - మోదీకి మన్మోహన్ చురకలు
Manmohan Singh: ప్రధాని పదవికి మోదీ మచ్చ తెచ్చి పెట్టారని విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారని మన్మోహన్ సింగ్ మండి పడ్డారు.
Manmohan Singh Slams Modi: ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా మండి పడ్డారు. ప్రధాని పదవికే ఆయన మచ్చ తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకు పంచి పెడుతుందని ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మన్మోహన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ ఓటర్లకు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయం ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న సమయంలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. మోదీ ప్రచారాన్ని తాను ముందు నుంచీ గమనిస్తూనే ఉన్నానని చెప్పిన ఆయన ప్రజల్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో విషం చిమ్మారని అసహనం వ్యక్తం చేశారు.
"ప్రజల గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీయే. ఆ పదవికీ మచ్చ తెచ్చి పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఏ ప్రధానమంత్రి కూడా ఈ స్థాయిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు. సమాజంలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అలా మాట్లాడడం ఆందోళన కలిగించింది"
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
“In the past ten years, the BJP government has left no stone unturned in castigating Punjab, Punjabis and Punjabiyat.
— Congress (@INCIndia) May 30, 2024
750 farmers, mostly belonging to Punjab, were martyred while incessantly waiting at Delhi borders, for months together. As if the lathis and the rubber bullets… pic.twitter.com/xJZQrsT3f8
దేశంలోని అన్ని వనరులపై మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారంటూ మోదీ విమర్శించారు. ఈ విమర్శలపై మన్మోహన్ స్పందించారు. ఇదంతా అవాస్తవం అని కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన చేయలేదని, ఇలాంటివి చేయడంలో బీజేపీకి మాత్రమే కాపీరైట్ ఉందని చురకలు అంటించారు. పదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి ఉన్న ఆదాయాన్ని పోగొట్టారని మండి పడ్డారు మన్మోహన్ సింగ్. రైతు చట్టాల్ని నిలదీస్తూ పంజాబ్ రైతులు రోడ్లపైకి వస్తే వాళ్లని ఆందోళనకారులు అనే ముద్ర వేశారని విమర్శించారు. వాళ్లపై లాఠీఛార్జీలు చేయడంతో పాటు బులెట్‌ల వర్షం కురిపించారని ఫైర్ అయ్యారు. తమను సంప్రదించకుండానే చట్టాలు ఎందుకు చేశారని నిలదీసిన పాపానికి అంత దారుణంగా వ్యవహరించారని మన్మోహన్ తన లేఖలో ప్రస్తావించారు.
"గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ముందు వెనకా ఆలోచించకుండా GST అమలు చేశారు. కొవిడ్ సంక్షోభాన్నీ సరైన విధంగా హ్యాండిల్ చేయలేకపోయారు. జీడీపీ కూడా అనుకున్న స్థాయిలో నమోదు కావడం లేదు. రైతు చట్టాల్ని వ్యతిరేకించినందుకు ఢిల్లీ సరిహద్దుల్లో కనీసం 750 మంది పంజాబ్ రైతుల్ని బలి తీసుకున్నారు. ఇంత కన్నా దారుణం ఏముంటుంది"
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
Also Read: Naveen Patnaik: నేను ఆరోగ్యంగా ఉన్నా, ఓట్ల కోసమే ఈ పుకార్లు - మోదీకి నవీన్ పట్నాయక్ కౌంటర్