(Source: ECI/ABP News/ABP Majha)
Manda Krishna Madiga : మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?
SC Sub Categorization : ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మూడు దశాబ్దాల కిందట నాంది పలికి ఇప్పటికి విజయం సాధించారు మంద కృష్ణ. ఈ కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మరి తర్వాత ఏం చేయబోతున్నారు ?
Manda Krishna Madiga Struggle For SC Sub Categorization : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్‌లో ఎమ్మార్సీఎస్ బహిరంగసభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ వేదికపై ప్రధాని మోదీ మంద కృష్ణను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప పెద్దగా ఇతర రాష్ట్రాల వారికి తెలియని ఓ నేతపై మోదీ ఇంత అభిమానం చూపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మోదీ అంత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వారిలో అంతర్జాతీయ నేతలు.. ఇస్రో మాజీ చైర్మన్ శివన్ వంటి వారు ఉన్నారు. వారి జాబితాలో మంద కృష్ణ చేరారు. మోదీ ఇంత అభిమానం చూపడానికి కారణం మందకృష్ణ పోరాట నేపధ్యమే.
ఎస్సీ వర్గీకరణ పోరాటం కోసం జీవితం కేటాయించిన మంద కృష్ణ
మంద కృష్ణ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదని.. మాదిగ వర్గాలకు అన్యాయం జరుగుతోందని గుర్తించిన తర్వాత ఆయన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభించారు. 1994, జూలై 7న ఈదుముడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మంద కృష్ణ ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ మొదటి సమావేశం 1995 మే 31న ఒంగోలులో జరిగింది. 1996 మార్చి 2న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో మందకృష్ణ నేతృత్వంలో సుమారు 5 లక్షల మంది మాదిగలతో తొలి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ తర్వాత ముఫ్పై ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పోరాటంలో ఎంతో మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చనిపోయారు. అయినా ఎమ్మార్పీఎస్ ఉద్యమం పక్కదోవ పట్టకూడదని ప్రతీకార రాజకీయాల వైపు చూడలేదని మంద కృష్ణ చెబుతారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ప్రాణత్యాగాలు
30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ సారి గాంధీభవన్ ముట్టడిలో ఎమ్మార్పీఎ్‌సకు చెందిన నలుగురు నాయకులు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడగా... వారిలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన కారణంగా గాంధీభవన్‌కు రావాల్సిన సోనియా గాంధీ తన పర్యటన వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. మంద కృష్ణ చేసిన పోరాటంలో ప్రాణభయం అనేది ఎప్పుడూ చూపించలేదు. పెట్రోలు బాటిళ్లు పట్టుకుని దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. రాజకీయ పార్టీల వ్యూహాల్లో చిక్కుకుతుంది. అయితే మందకృష్ణ ఎప్పుడూ తన లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు.
పదవులను తిరస్కరించి ఉద్యమం
మంద కృష్ణ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం. అందుకే ఆయనకు రాజకీయ పార్టీలు ఎన్నో సార్లు పదవులను ఆఫర్ చేశాయి. చంద్రబాబునాయుడు మొదట పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారు. కానీ వద్దనుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ సీటును ఆఫర్ చేసింది. వైఎస్ హయాంలో ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని ప్రతిపాదన పెట్టారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని కబురు చేసింది. అయితే అన్నింటినీ మందకృష్ణ వద్దనుకున్నారు. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా స్వతంత్రంగానే పోటీ చేసి. ఏదైనా రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తే తన ఉద్యమం ఆ పార్టీకి అనుకూలంగా మారినట్లవుతుందని ఆయన చెబుతారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రతి రాజకీయ పార్టీకి మందకృష్ణ మద్దతు తెలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోనివారిని వ్యతిరేకించారు. ఇప్పుడు మందకృష్ణ ఏం చేయబోతున్నారంటే.. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కారం కోసం పోరాడతానని అంటున్నారు. మందకృష్ణ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆయవ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు.