Mamata on Pegasus: ఫోన్ కు ప్లాస్టర్ వేశా.. 2024లో భాజపాకు వేస్తా: దీదీ
పెగాసస్ వ్యవహారంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. భారత్ ను సంక్షేమ రాజ్యంగా మార్చడానికి బదులు నిఘా రాజ్యంగా మారుస్తున్నారని మోదీపై విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న 'పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం'పై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య భారత్‌ను మోదీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటుందని విమర్శించారు. పెగాసస్‌కు భయపడి తన ఫోన్‌కు ప్లాస్టర్ వేసుకున్నానని దీదీ చెప్పారు. ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్ వేయాలంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు.
నిఘా పెడతారనే అలా చేశా..
హ్యాకింగ్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని మమత ఈ సందర్భంగా కోరారు. ‘ఇంతమంది ఫోన్లపై నిఘా పెట్టారని తెలిసి ఈ కేసును ఎందుకు సుమోటోగా విచారించకూడదని ఆమె ప్రశ్నించారు. కేవలం న్యాయవ్యవస్థ ఒక్కటే దేశాన్ని కాపాడగలదని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
సంచలనం సృష్టిస్తోన్న హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించి స్పైవేర్ లక్షిత జాబితాలో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతల ఫోన్ నంబర్లు ఉన్నట్లు తెలిసింది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బంగాల్ ఎన్నికల్లో దీదీకి విజయం అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోన్లపైనా హ్యాకింగ్ జరిగినట్లు ది వైర్ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.