పట్టుదలకు పోవద్దు, భారత్‌తో మాట్లాడండి - మాల్దీవ్స్ అధ్యక్షుడికి కీలక నేతల హితబోధ
Mohamed Muizzu: భారత్‌తో విభేదాలు పక్కన పెట్టి మాట్లాడాలని మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ముయిజూకి కొందరు నేతలు సలహా ఇస్తున్నారు.
India Maldives Ties: భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత మాల్దీవ్స్ మంత్రులు భారత్‌పై నోరు పారేసుకోవడం నుంచి మొదలైన వివాదం సద్దుమణగడం లేదు. పైగా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ (Mohamed Muizzu) కూడా భారత్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మరింత దూరాన్ని పెంచింది. అయితే...అధ్యక్షుడి తీరుపై కొందరు నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. భారత్‌తో మైత్రిని చెడగొట్టుకోవద్దంటూ సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు బహిరంగంగానే ముయిజూపై విమర్శలు చేశారు. భారత్‌తో ఎన్నో ఏళ్లుగా ఉన్న బంధాన్ని కాదనుకుంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. గతేడాది సెప్టెంబర్‌లో మాల్దీవ్స్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ రేసులో ముయిజూకి ప్రత్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ సోలిహ్ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కూడా భారత్-మాల్దీవ్స్ విభేదాలపై స్పందించారు. ఓ ర్యాలీలో పాల్గొన్న సోలిహ్ ముయిజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన మాల్దీవ్స్‌ని కాపాడాలని కోరడానికైనా ముయిజూ భారత్‌తో మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అన్నారు. ఇదే సమయంలో చైనా నుంచి తీసుకున్న అప్పుల గురించీ ప్రస్తావించారు. ప్రస్తుతానికి చైనాకి 18 బిలియన్ రుఫియాల మేర మాల్దీవ్స్ రుణం చెల్లించాల్సి ఉంది. ఇటు భారత్‌కి 8 బిలియన్ రుఫియాల మేర అప్పు పడింది. ఇలాంటి సమయంలో అనవసరంగా విభేదాలు పెట్టుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోలిహ్ స్పష్టం చేశారు.
"ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాల్దీవ్స్‌కి పొరుగు దేశాలు సాయం చేస్తాయనే అనుకుంటున్నాను. పట్టుదలకు పోవడం మంచిది కాదు. మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. మనకి సాయం చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ముయిజూ మాత్రం మొండివైఖరితో ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే బహుశా పరిస్థితి అర్థం అవుతుందేమో"
- మహమ్మద్ సోలిహ్