Maharashtra political Crisis: మహారాష్ట్రలో తరవాత ఏం జరగొచ్చు, ఏక్‌నాథ్‌పై ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరోసారి ఫిరాయింపుల చట్టంపై చర్చకు దారి తీశాయి.
ఫిరాయింపుల వ్యతిరేక చట్టంపై చర్చ..
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఊహించలేం. ఫలానా పార్టీ అవినీతి పుట్ట అని తిట్టిన నేత, తెల్లారే సరికి అదే పార్టీ కండువా కప్పుకుంటాడు. ఆ స్థాయిలో ఉంటాయ్ ఫిరాయింపులు. అయితే ఇటీవలి కాలంలో ఈ జంపింగ్‌లు మరీ ఎక్కువైపోతున్నాయి. ఈ ఫిరాయింపుల కారణంగా ఏకంగా ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు రాగా... ప్రస్తుతం మహారాష్ట్రలో ఇదే నాటకం నడుస్తోంది. మంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేనపై తిరుగుబావుటా ఎగరేసి బయటకొచ్చారు. పలువురు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు. ఫలితంగా థాక్రే సర్కార్ ప్రమాదంలో పడిపోయింది. రాజీనామా చేసేందుకు సిద్ధమేనంటూ ఉద్దవ్ థాక్రే ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మరోసారి ఫిరాయింపుల చట్టం అంశం తెరపైకి వచ్చింది.
శివసేన అధిష్ఠానం ఎమ్మెల్యేలందరినీ పిలిచి ముంబయిలో మీటింగ్ పెట్టింది. ఈ సమావేశాని కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండేకి మద్దతుగా గువాహటిలో ఉండిపోయారు. ఇదే పార్టీ అధిష్ఠానానికి ఆగ్రహం కలిగించింది. ఈ సమావేశానికి హాజరు కానీ నేతలంతా వెంటనే పార్టీని వీడిపోవాలని హెచ్చరించింది. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.
అసలేంటీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం..?
ఓ పార్టీ టికెట్ పొంది, గెలిచిన ఎమ్మెల్యే..అనుమతి లేకుండానే పార్టీ సభ్యత్వం నుంచి తప్పుకోవటం ఫిరాయింపుగా పరిగణిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకూ ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. ఎప్పుడైతే స్వతంత్ర అభ్యర్థులు ఓ పార్టీలో చేరతారో అప్పుడే వాళ్లు శాసనసభ నుంచి సభ్యత్వం కోల్పోయినట్టు లెక్క. అయితే ఫిరాయింపుల చట్టం వర్తించని సందర్భాలూ ఉన్నాయి. ఎప్పుడైతే ఓ ఎమ్మెల్యే మూడింట రెండొంతుల సభ్యుల మెజార్టీతో పార్టీ నుంచి బయటకు వస్తాడో అప్పుడు ఈ చట్టం వర్తించదు. వీళ్లంతా కలిసి వేరే పార్టీలో చేరొచ్చు లేదా ప్రత్యేక గ్రూప్‌గా అయినా ఉండొచ్చు.
రెబల్ లీడర్‌కి ఎంత మంది మద్దతు ఉంది అన్నది స్పీకర్ డిసైడ్ చేస్తారు. అయితే ప్రస్తుతానికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో సీనియర్ కాంగ్రెస్ నేత నానా పటోల్ స్పీకర్‌గా వ్యవహరించారు. 2019లో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ఆయన విధుల్ని డిప్యుటీ స్పీకర్ నిర్వర్తించే అవకాశముంటుంది. ప్రస్తుతానికి ఎన్‌సీపీ నేత నరహరి జిర్వాల్ డిప్యుటీ స్పీకర్‌గా ఉన్నారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఆయనదే.
ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే..?
ఫిరాయింపుల చట్టం అమలయ్యే ముందు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మొదటిది, ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలందరూ కలిసి ఏక్‌నాథ్ షిండేకి మద్దతు తెలిపే వారిపై ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అమలు చేయాలని డిప్యుటీ స్పీకర్‌కు లేఖ రాయడం. ఆధారాలతో సహా ఈ లెటర్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరవాత డిప్యుటీ స్పీకర్ ఈ లేఖను ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు
అందిస్తారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇస్తారు. ఇక మరో వైపు చూస్తే..అటు ఏక్‌నాథ్ షిండే కూడా డిప్యుటీ స్పీకర్‌కు లేఖ రాయొచ్చు. తనకు మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఫిరాయింపుల వ్యతిరేక చట్టం నుంచి కాపాడమని అందులో ప్రస్తావించేందుకు
అవకాశం ఉంటుంది. ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గవర్నర్ వద్దకు వెళ్లి శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరవచ్చు. అయితే మధ్యంతర ఎన్నికలు జరపాలా వద్దా అన్నది గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.