Maharashtra Bus Fire: బస్సులు కావవి శవపేటికలు- స్లీపర్ బస్సులపై తీవ్ర విర్శలు- నిషేధించాలంటున్న నిపుణులు
Maharashtra Bus Fire: స్లీపర్ బస్సులు కదిలే శవపేటికలు అని.. వెంటనే వాటిని నిషేదించాల్సిన అవరసం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర బస్సు ప్రమాదం తర్వాత నిపుణులు ఈ విషయం చెప్పారు.
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నాగపూర్ నుంచి పుణె వెళ్తున్న బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఈ దుర్ఘటనలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉండగా.. పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో పది మంది గాయపడగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు పూర్తిగా కాలి బూడిద అయింది. అయితే ఈ ఘటనపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అన్ని స్లీపర్ బస్సులు "కదిలే శవపేటికలు" అంటూ బస్సు డిజైన్ ను రూపొందించిన నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.
కదలడానికి స్థలముండదు.. కానీ పడుకునే వీలుంటుంది..!
ఎంఎస్ఆర్టీసీ బస్సుల రూపొందించిన డిజైనర్ రవి మహేందాలే మాట్లాడుతూ.. స్లీపర్ బస్సుల్లో ప్రయాణీకులు సుఖంగా పడుకునే వీలు ఉంటుందని చెప్పారు. కానీ అటూ ఇటూ కదలడానికి ఎక్కువ స్థలం ఉండదని వివరించారు. స్లీపర్ బస్సులు సాధారణంగా 8 నుంచి 9 అడుగుల పొడవు ఉంటుందని.. ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు వెంటనే బస్సును తప్పించాలంటే మాత్రం కష్టం అవుతుందని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగప్పుడు బస్సులో ఉన్న వాళ్లను రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. ఎక్కువ ఎత్తుకు చేరుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లో లోపలున్న వారిని బయటకు తీసుకు రావడం చాలా కష్టంగా మారుతుందని మహేందాలే వెల్లడించారు. 8 నుంచి 9 అడుగులు ఎత్తుకు చేరుకొని ఓ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం స్లీపర్ బస్సుల ఉత్పత్తిని నిషేధించాలని కోరుతూ.. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు తాను పలు లేఖలు రాశానని మహేందాలే చెప్పారు. తనకు ఇప్పటి వరకు మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. అలాగే భారత దేశం, పాకిస్తాన్ మినహా మరే ఇతర దేశంలో స్లీపర్ బస్సులు లేవని చెప్పుకొచ్చారు.
హైవేలపై వేగ పరిమితి నియంత్రించాల్సిన అవసరం ఉంది..!
ఇదిలా ఉండగా.. పుణె, పింప్రిచించ్వాడ్‌లోని ఆర్టీఓలు ప్రైవేట్ బస్సుల నాణ్యతను తనిఖీ చేయడానికి డ్రైవ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. హైవేలపై వేగ పరిమితిని నియంత్రించాల్సిన అవసరం కూడా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమృద్ధి మహా మార్గ్‌లో వేగ పరిమితి గంటకు 120 కి.మీ. ముందు 100 కేఎంపీహెచ్ వేగంతో డ్రైవ్ చేయగల సామర్థ్యాన్ని పరీక్షించాల్సి ఉందని అంటున్నారు. ప్రభుత్వం వేగ పరిమితిని తగ్గించాలని.. ప్రమాదాల సంఖ్య తగ్గిన తర్వాత అది క్రమంగా పెంచవచ్చని సూచించారు. అలాగే రహదారి మలుపులు లేకుండా ఉండటం కూడా ప్రమాదానికి ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల డ్రైవర్లకు విసుగుతో పాటు నిద్ర వస్తుందని వివరించారు. ఇలాంటి వాటి వల్లే ప్రమాదాలు జరుగుతాయని.. సేవ్ పుణె ట్రాఫిక్ మూవ్ మెంట్‌కు చెందిన హర్షద్ అభ్యంకర్ అన్నారు. ప్రభుత్వం అన్ని రహదారులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏం చేసినా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.