(Source: ECI/ABP News/ABP Majha)
కశ్మీరీ నిజాం హరిసింగ్‌ను కీర్తిస్తున్న బీజేపీ- జయంతి రోజు సెలవుపై ప్రతిపక్షాల ఆగ్రహం
Maharaja Hari Singh Birth Anniversary: కశ్మీర్ ఆఖరి మహారాజు హరిసింగ్ పుట్టిన రోజును అధికారిక సెలవుగా ప్రకటించటంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Maharaja Hari Singh Birth Anniversary: సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆఖరి నిజాం మెడలు వంచి నాడు కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యను ప్రశంసిస్తూ...బీజేపీ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరి నిజాంలానే కశ్మీర్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో కలపకుండా తాత్సారం చేసిన కశ్మీర్ ఆఖరి మహారాజు హరిసింగ్ పుట్టినరోజును మాత్రం అధికారిక సెలవుగా ప్రకటించటంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
అసలు ఎవరీ హరిసింగ్
1925లో కశ్మీర్ మహారాజు ప్రతాప్ సింగ్ మరణం తర్వాత...డోగ్రా వంశం నాలుగో మహారాజుగా పాలనా పగ్గాలు చేపట్టారు ప్రతాప్ సింగ్ మేనల్లుడు హరిసింగ్. ప్రతాప్ సింగ్‌కు వారసులు ఎవరూ బతికి లేకపోవటంతో హరిసింగ్ మహారాజుగా అధికారాన్ని చేపట్టారు. అయితే 1947లో అప్పటివరకూ ఉన్న భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తమ సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయటానికి ఇష్టం చూపించని సంస్థానాలు రెండే. ఒకటి హైదారాబాద్ నిజాం సంస్థానం, రెండోది కశ్మీర్ డోగ్రా సంస్థానం. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లానే..ఆఖరి డోగ్రా రూలర్ మహారాజా హరిసింగ్ కూడా కశ్మీర్‌ను ప్రత్యేక రాజ్యంగా ఉంచాలనుకున్నారు. అటు పాకిస్థాన్, ఇటు భారత్ తోనూ సత్సంబంధాలు ఉంచేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అంటారు.
హరిసింగ్ వల్లే ఇదంతా
అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పాకిస్థాన్ 1947 అక్టోబరులో పాకిస్థాన్ సైన్యం పష్తూన్ గిరిజనులను జమ్మూకశ్మీర్‌పై దాడికి ఉసిగొల్పింది. వారికి ఆయుధాలను అందించి, శ్రీనగర్‌ను ఆక్రమించుకోడానికి పంపింది. పష్తూన్ గిరిజనులు కశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. దీన్నే పాక్ ఆక్రమిత కశ్మీర్ అని భారత్... ఆజాదీ కశ్మీర్ అని పాకిస్థాన్ చెబుతోంది. ఇక చేసేదేం లేక రాజా హరిసింగ్ భారత్‌ను సైనిక సాయం కోరారు. ఈ సమయంలో నాటి హోం మంత్రి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ షరతులు విధించారు. అందులో ప్రధానమైంది... కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని. దీనికి రాజా హరిసింగ్ అంగీకరించారు. అప్పట్నుంచి జమ్మూకశ్మీర్ మొత్తం తమదే అని మన దేశం చెబుతోంది. పాకిస్థాన్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది.
చైనాకు ఇచ్చిన పాకిస్థాన్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రెండు భాగాలున్నాయి. ఒకటి ఆజాద్ కశ్మీర్, రెండోది గిల్గిత్- బాల్టిస్థాన్. బాల్టిస్థాన్‌లోని షక్సగమ్ నుంచి గిల్గిత్‌లోని రుక్సం వరకు ఉన్న భూభాగాన్ని ట్రాన్స్ కారాకోరం మార్గంగా పిలుస్తారు. దీనిని చైనాకు పాకిస్థాన్ ధారదత్తం చేసింది. కశ్మీర్‌లోని అక్సాయిచిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. తాత్కాలిక రాజ్యాంగ చట్టం ప్రకారం ఆజాదీ కశ్మీర్ పరిపాలన కొనసాగుతోంది. దీనికి ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధాని ఉన్నప్పటికీ వీరికి ఎలాంటి అధికారాలూ లేవు. ప్రతి చిన్న విషయానికీ పాకిస్థాన్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. 2019లో భారత్ పార్లమెంట్‌లో కొత్త చట్టాలు చేసే వరకూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అధికారాలు ఉండేవి. ఇప్పుడు జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. 1952 వరకూ అంటే భారత్ యూనియన్‌లో విలీనమైనా కూడా కశ్మీర్ మహారాజుగా హరిసింగ్ అధికారాన్ని చెలాయించారు. ఆ తర్వాత తన కుమారుడైన కరణ్ సింగ్‌ను యువరాజుగా ప్రకటించి బొంబాయికి వెళ్లిపోయి మిగిలిన జివీతాన్ని గడిపి 1961 లో చనిపోయారు. 1964 వరకూ హరిసింగ్ కుమారుడు కరణ్ సింగే కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్నారు. చరణ్ సింగ్, ఇందిరాగాంధీ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగానూ పనిచేశారు కరణ్ సింగ్. ఆ తర్వాత అబ్దుల్లాల నేషనల్ కాన్ఫరెన్స్‌లో చేరారు. మళ్లీ కాంగ్రెస్‌కు తిరిగొచ్చి ఇప్పటికీ కాంగ్రెస్ తోనే ఉన్నారు. కరణ్ సింగ్ పెద్దకుమారుడు విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్‌లోనూ, చిన్న కుమారుడు అజాతశత్రు సింగ్ బీజేపీలోనూ ఉన్నారు. సో ఇది వాళ్ల ఫ్యామిలీలకు రాజకీయాలతో ఉన్న సంబంధం.
అమరవీరుల దినోత్సవం రద్దు
ఇక్కడే ఓ విషయం గమనించాలి 1931లో రాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా కశ్మీరీలు ఆందోళనలకు దిగారు. అప్పుడు కొన్ని వందల మంది కశ్మీరీ ఆందోళనకారులపై రాజా హరిసింగ్ సైన్యం దాడికి దిగింది. ఈ గొడవల్లో 21 మంది ముస్లిం యువకులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పటి వరకూ 13 జులైన కశ్మీర్ అమరవీరుల దినోత్సవంగా రాష్ట్రం అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ వచ్చేది. తాజాగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆ సెలవును గెజిట్ నుంచి తొలగించారు. అంతే కాదు రాజా హరిసింగ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 23 న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా హరిసింగ్ వంశీకులు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చినట్లైంది.
వాస్తవానికి ప్రత్యేక సంస్థానంగా ఉంచాలనే హరిసింగ్ నిర్ణయాన్ని పక్కన పెడితే....ఓ సోషల్ రిఫార్మర్ గా హరి సింగ్ కు మంచి పేరుందనేది బీజేపీ వినిపిస్తోన్న వాదన. 1926లో ఆయన వ్యవసాయంలో తీసుకువచ్చిన సంస్కరణలు, 1930లో తీసుకువచ్చిన నిర్బంద విద్యాహక్కు చట్టం హరిసింగ్‌కు పాలనాదక్షుడిగా పేరు తీసుకువచ్చాయని బీజేపీ చెబుతోంది. టీబీపై పోరాటానికి ఆయన నిర్మించిన ఆసుపత్రులు, పశుపోషణపై ఆధారపడిన వారికి జీవనోపాధి కల్పించేలా అమలు చేసిన పథకాలన్నీ ఆయన పరిపాలనకు మచ్చుతునకలని..అందుకే మహారాజా హరి సింగ్ జయంతిని అధికారిక సెలవుగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీజేపీ చెబుతోంది. అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి.
నిజాంకు మరో న్యాయం
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అసలు ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటో వివరించగలరా అంటూ ట్వీట్లు చేశారు. సీతారాం ఏచూరి లాంటి వామపక్ష నాయకులు నిజాం పాలనకు విమోచన దినం, హరిసింగ్ కు మాత్రం అధికారిక సెలవుదినమా..ఇది బీజేపీ రెండు నాలుకల ధోరణికి నిదర్శనమంటూ విమర్శించారు. పరిపాలన దక్షతకు భవంతులు, ఆసుపత్రుల నిర్మాణమే నిదర్శనమైతే హైదరాబాద్‌లో నేటికీ నిజాం కట్టించిన ఆసుపత్రులున్నాయని వామపక్ష నేతలు వినిపిస్తున్న వాదన. కేవలం ఎన్నికల కోసం బీజేపీ కశ్మీర్ లో ఈ రోజు ఇలాంటి పరిస్థితికి కారణమైన వ్యక్తికి కేవలం మత ప్రాతిపదికన ప్రాధాన్యత కల్పిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. సో ఇది ఆఖరి కశ్మీర్ మహారాజు హరిసింగ్ జయంతి అధికారిక సెలవు చుట్టూ నెలకొన్న రాజకీయం.