Maha Kumbh 2025 : చేతిలో ఆఫిల్ ఐఫోన్, ట్రైప్యాడ్ - 'డిజిటల్ బాబా' గా అవతారమెత్తి నెలకు రూ.1.5లక్షలు సంపాదిస్తోన్న సాధువు
Maha Kumbh 2025 : ఒక చేతిలో ఐఫోన్, మరో చేతిలో ట్రైప్యాడ్‌తో ఆకట్టుకుంటున్న డిజిటల్ బాబా. సోషల్ మీడియాలో దూసుకుపోతూ మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోన్న స్వామి రామ్ శంకర్ మహారాజ్.
Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025 ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చే ఒక్కో రకం సాధువుల గురించిన వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. సాధారణంగా సాధువులు అంటే ముఖానికి విభూతి, జడలు కట్టిన జుట్టు, చేతిలో త్రిశూలం లాంటి భిన్న వేషధారణాల్లో కనిపిస్తూ ఉంటారు. కానీ ఓ సాధువు మాత్రం వీరందరికీ భిన్నంగా కనిపిస్తున్నారు. చేతిలో ఆపిల్ ప్రొడక్ట్స్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ట్రైప్యాడ్ తో వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్న ఈ బాబాకు సంబంధించిన ప్రత్యేకమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చేతిలో కమండలం, పటకారుతో కనిపించే సాధువులను చూసే ఉంటాం. కానీ స్వామి రామ్ శంకర్ మహారాజ్ సాధువు చేతిలో ఆపిల్ ఐఫోన్ 16 మ్యాక్స్ ప్రో, ఆపిల్ 2024 మ్యాక్ బుక్ ప్రో ఎమ్ 4 మ్యాక్స్ (Apple IPhone 16 Max Pro, Apple 2024 MacBook Pro M4 Max)తో పాటు ట్రై ప్యాడ్, రోడ్ వైర్‌లెస్ మైక్రోఫోన్ తో ముందుకు సాగుతున్నాడు. అతనికి ఫేస్ బుక్ లో 3లక్షల 36వేల ఫాలోవర్లు, 29వేల పైగా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ ను కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంలో చూసిన అతన్ని ఇప్పుడు 'డిజిటల్ బాబా' అని పిలుస్తున్నారు.
డిజిటల్ బాబా జర్నీ
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జన్మించిన స్వామి రామ్ శంకర్ మహారాజ్.. 2008లో అయోధ్యలోని లోమాష్ రిషి ఆశ్రమంలో మహంత్ స్వామి శివచరణ్ దాస్ మహారాజ్ చేత సన్యాసం పుచ్చుకున్నారు. ఆధ్యాత్మిక అధ్యయనాలను అభ్యసించి, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించారు. ఖైరాగఢ్ సంగీత విశ్వవిద్యాలయంలో తన సంగీత నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. 2017 నుండి, అతను హిమాచల్ ప్రదేశ్‌లోని బైజ్‌నాథ్ ధామ్‌లో నివసిస్తూ, వేదాంతానికి సంబంధించిన ఉపన్యాసాలు అందిస్తూ యువతను ఆధ్యాత్మికత వైపు ప్రేరేపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాజీ ఎన్సీసీ క్యాడెట్, థియేటర్ ఔత్సాహికుడు అయిన డిజిటల్ బాబా.. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఆశపడ్డారు. కానీ 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.
#kumbhmela2025 #pryagrajkumbh #swamiramshankar #DigitalBaba #NewsUpdate #kumbhmela #kumbh#kumbh2025 #kumbhmela2025prayagraj #kumbh #KumbhMelaPrayagraj pic.twitter.com/PSrWxiTeJ3
— Swami Ram Shankar (@swamiramshankar) January 13, 2025
అందుకే డిజిటల్ మారానన్న స్వామి రామ్ శంకర్ మహారాజ్
2019లో ఐఫోన్ కొని డిజిటల్ రంగంలోకి ప్రవేశించిన రామ్ శంకర్ మహారాజ్.. భారతదేశంలోని గురుకులాలలో తన చదువును పూర్తి చేసిన తర్వాత, అతను ఒకరోజు ఫేస్‌బుక్‌లో ఓ ఖాతాను క్రియేట్ చేశారు. సోషల్ మీడియా పవర్‌ని గ్రహించి, ఆకట్టుకునే వీడియోల ద్వారా లక్షల మందితో కనెక్ట్ అవడం ప్రారంభించారు. "యువతతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా సరికొత్త మార్గమని నేను గ్రహించాను, అందుకే నేను డిజిటల్ బాబాగా మారాను" అని ఆయన చెప్పుకొచ్చారు. మొదట్లో యూట్యూబ్ ట్యుటోరియల్స్ ద్వారా మార్గదర్శకత్వం వహించిన డిజిటల్ బాబా సాంకేతికతను ఉత్సాహంతో స్వీకరించారు. "సాధువులు తమ మార్గాలను ఆధునీకరించుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. తన వీడియోల ద్వారా సనాతన ధర్మం, ఆధ్యాత్మిక ఆలోచనలను చర్చించడమే కాకుండా, మహా కుంభ్ 2025లో సౌకర్యాలు, ఆకర్షణల గురించి కూడా రామ్ శంకర్ మహారాజ్ అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 12న, కుంభ్‌లో వసతి గురించి చర్చించిన ఫేస్‌బుక్ వీడియోకు 200కి పైగా కామెంట్‌లు వచ్చాయి.
బ్రహ్మచారి జీవితంపై స్పందించిన శంకర్ మహారాజ్.. “నేను ఒక దశాబ్దం పాటు వివాహానికి దూరంగా ఉన్నాను. కానీ దాని ప్రాముఖ్యతను తెలుసుకుని నేను అభినందించాను. సంగీతాన్ని లోతుగా అర్థం చేసుకునే, నా ఆలోచనలతో ప్రతిధ్వనించే హృదయపూర్వక వ్యక్తిని నేను కలిస్తే, నేను వివాహం గురించి ఆలోచిస్తాను" అని చెప్పారు. దైవిక చిత్తాన్ని విశ్వసిస్తూ, “ఏది జరిగినా అది భగవంతుడు నిర్ణయించిందే. ఆయన నన్ను సరైనదానికి నడిపిస్తాడనే నమ్మకంతో ఈ కోరికను ఆయనకు అప్పగిస్తున్నాను" అని తెలిపారు. ఇకపోతే తన మత ప్రబోధాల ద్వారా నెలకు రూ.1లక్షకు పైగా సంపాదిస్తోన్న ఈ బాబా ఆధునిక విధానమే ఆయనకు ఆదాయ వనరుగా మారింది. నవంబర్‌లో, ఆయన లక్నోలో ఏడు రోజుల రామ్ కథను నిర్వహించి దాదాపు రూ. 1.5 లక్షలు సంపాదించాడు. దాంతో అతను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రా ఫోన్ ను కొనుగోలు చేశాడు.