Shinde Fadnavis Delhi Visit: మహా సీఎం శిందే దిల్లీ పర్యటన అందుకేనా? కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారట!
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారవుతున్నట్టు సమాచారం. సీఎం శిందే దిల్లీ పర్యటన అందుకేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కేబినెట్ విస్తరణకు రెడీ..
మంత్రివర్గ విస్తరణను పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే. సీఎం పదవి చేపట్టాక మొదటి సారి రెండ్రోజుల దిల్లీ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. కేబినెట్ విస్తరణకు భాజపా సలహాలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించారు శిందే. ఇప్పుడు దిల్లీ పర్యటనతో అది స్పష్టమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం
తీసుకోవాలని భావిస్తున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ అయ్యాక మంత్రి వర్గ విస్తరణను
ప్రారంభించే అవకాశముంది. అయితే పూర్తి వివరాలు మాత్రం ఇంత వరకూ అధికారంగా వెల్లడించలేదు. శనివారం ఈ పెద్దలతో సమావేశం ముగిశాక పుణె వెళ్లనున్నారు శిందే. పందర్‌పూర్ టెంపుల్‌లో ఆదివారం ఉదయం ఏకాదశి పూజలు నిర్వహించనున్నారు. హిందూ పండుగల్లో కీలకంగా భావించే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరవటం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.
నేతల ప్రొఫైల్స్ పరిశీలిస్తున్న సీఎం శిందే
రెండు విడతలుగా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ జరగక ముందు ఓ విడత విస్తరణ చేసి, ఎన్నికలు పూర్తయ్యాక మరో ఫేజ్ చేపట్టాలని యోచిస్తోంది శిందే ప్రభుత్వం. జూన్ 30 వ తేదీన సీఎంగా ఏక్‌నాథ్ శిందే, డిప్యుటీ సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లతో పాటు గవర్నర్ తప్ప మరెవరూ బాధ్యతలు చేపట్టలేదు. ట్రస్ట్ ఓట్ ప్రక్రియలో గెలుపొందాక, కేబినెట్ విస్తరణ చేస్తారని భావించారు. కానీ ఇందుకు కాస్త సమయం కావాలని సీఎం శిందే అన్నారట. నేతలందరి ప్రొఫైల్స్ మరోసారి చూశాక, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారట.
జులై 11 తరవాత..విస్తరణ..?
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం...28 మంది భాజపా నేతలకు మంత్రిత్వ శాఖలు అప్పగించేందుకు సీఎం శిందే అంగీకరించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పాటికే కేబినెట్ విస్తరణ జరగాల్సింది. కానీ, శిందే శిబిరంలోకి వెళ్లిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలన్న వాదనను సుప్రీం కోర్టు ఇంకా వినాల్సి ఉంది. అంతే కాదు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మరో పిటిషన్ కూడా వేశారు. శివసేన విప్‌ను కాదని శిందే సూచించిన కొత్త విప్‌ను నియమించటాన్ని సవాలు చేశారు. ఈ హియరింగ్ అయిపోయాకే, కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావించారు. అయితే ఈ జులై 11వ తేదీన హియరింగ్ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై ఈ విషయమై ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం.
Also Read: Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?