Look Back 2023: 2023ని మర్చిపోలేని విధంగా చేసిన ఉత్తరకాశీ సొరంగం ఘటన - పాఠాలు నేర్పిన ప్రమాదం
Look Back 2023: ఉత్తరకాశీ సొరంగం ఘటన 2023 ఏడాదిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది.
Look Back India 2023:
ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటన..
ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో దేశం మొత్తాన్ని టెన్షన్ పెట్టిన ఘటన ఉత్తరకాశీలోని సొరంగం (Uttarakashi Tunnel Collapse) కూలిపోవడం. సిల్కియారా సొరంగం నిర్మాణంలో ఉండగా ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. నవంబర్ 12 న జరిగిందీ ప్రమాదం. ప్రమాదం జరిగిన సమయంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. అప్పటి నుంచి నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. దాదాపు 17 రోజుల తరవాత ఇది సక్సెస్ అయింది. నవంబర్ 29న సాయంత్రం అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఇది చెప్పుకోడానికి సింపుల్‌గానే అనిపించినా..17 రోజుల పాటు రెస్క్యూ టీమ్ పడ్డ శ్రమ (Uttarakashi Tunnel Rescue Operation) అంతా ఇంతా కాదు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని దారులున్నాయో అన్నీ పరీక్షించారు. అమెరికా నుంచి భారీ Augur Machineలు పట్టుకొచ్చారు. కానీ...అక్కడి రాళ్లు చాలా హార్డ్‌గా ఉండడం వల్ల ఆ మెషీన్‌లు డ్రిల్లింగ్ చేయలేకపోయాయి. బ్లేడ్‌లు విరిగిపోయాయి. ఆ మెషీన్ కూడా ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసుకొచ్చేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ప్రయత్నం మానకుండా కొనసాగించారు. చివరకు విజయం సాధించింది రెస్క్యూ టీమ్. ఈ సహాయక చర్యల కోసం అంతర్జాతీయ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix) కూడా వచ్చారు. థాయ్‌లాండ్‌లో సొరంగం కూలి చిన్నారులు చిక్కుకుంటే అప్పుడు దగ్గరుండి మరీ వాళ్లను బయటకు తీసుకొచ్చారు ఆర్నాల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. అందుకే ఆయననే ఉత్తరకాశీకి రప్పించింది ప్రభుత్వం. ఆయనే రెస్క్యూ ఆపరేషన్‌ని లీడ్ చేశారు. సవాళ్లు ఎదురవడం వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
అప్రమత్తం చేసిన ప్రమాదం..
ఈ ఏడాది మొత్తంలో ఇదే హైలైట్‌గా నిలిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. చివరకు బ్యాన్ చేసిన ర్యాట్ హోల్ మైనింగ్‌నే ఎంచుకున్నారు. ఆ మైనింగ్ వల్లే 41 మంది కార్మికులు సేఫ్‌గా బయటకు వచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో 22 ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొన్నాయి. విపత్తు సమయాల్లో భారత్ ఎలా స్పందిస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణగా నిలిచిపోయింది. కార్మికుల ప్రాణాలను కాపాడడానికి ప్రాధాన్యతనిస్తూనే...టెక్నికల్‌గా ఉన్న అన్ని ఆప్షన్స్‌నీ ప్రయత్నించింది రెస్క్యూ టీమ్. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్లకు పూర్తిగా స్వేఛ్చనిచ్చింది. హిమాలయా ప్రాంతాలను ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో సొరంగాలు తవ్వడం ఎంత ప్రమాదకరమో గుణపాఠమూ నేర్పింది ఈ ఘటన. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తరహా సొరంగాలు భారత్‌లో ఎక్కడెక్కడ నిర్మాణంలో ఉన్నాయో సేఫ్‌టీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ ఆడిట్ పూర్తవ్వడానికి నెలల సమయం పట్టే అవకాశముంది. కానీ..భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు ఇదే సరైన మార్గం అని కేంద్రం భావిస్తోంది. ఓ రకంగా ఈ ఘటన భారత్‌ని అప్రమత్తం చేసిందనే చెప్పాలి. పైగా సొరంగాల నిర్మాణం జరిగినప్పుడు ఎలాంటి ప్రమాణాలు పాటించాలో కూడా స్పష్టతనిచ్చింది. ఇకపై ఎక్కడ టన్నెల్స్ నిర్మించినా ఆ మేరకు అన్ని స్టాండర్డ్స్‌ని చూసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది ఈ ప్రమాదం.
Also Read: Look back 2023: G20 సదస్సుతో అంతర్జాతీయంగా మారుమోగిన భారత్ పేరు, ఈ ఏడాదికిదే హైలైట్