Lok Sabha Security Breach: అందుకే లోక్‌సభపై దాడి చేశాం! విచారణలో నిజాలు బయట పెట్టిన నిందితులు
Security Breach Lok Sabha: లోక్‌సభపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది.
Lok Sabha Security Breach:
లోక్‌సభలో దాడి..
లోక్‌సభపై దాడికి దాదాపు (Lok Sabha Security Breach) కొన్ని నెలల ముందుగానే ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులు ఈ స్కెచ్ వేసినట్టు వెల్లడించారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. అయితే...అదుపులో ఉన్న ఐదుగురినీ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి కారణాలేంటో ఆ నిందితులు వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టిని తమవైపు మరల్చడంతో పాటు కొన్ని కీలస సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్టు వాళ్లు అంగీకరించినట్టు సమాచారం. నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస లాంటి అంశాలపై ఆ నిందితులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కావాలనే కలర్ స్మోక్‌ని సభలో వదిలామని, అలా అయినా తమ సమస్యలేంటో ప్రభుత్వం తెలుసుకుని వాటిపై చర్చిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని తెలిపారు.
"వాళ్లు కొన్ని సమస్యల విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యల్ని తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే ఇలా దాడి చేశారు. భద్రతా ఏజెన్సీలు మాత్రం ఈ దాడి వెనకాల ఇంకేదైనా కుట్ర ఉందా అన్న కోణంలో విచారణ చేపడుతున్నాయి. ఎవరైనా వీళ్లను ప్రేరేపించి దాడి చేయించారా అన్న కోణంలోనూ విచారణ జరగనుంది"
- ఉన్నతాధికారి
ఈ విచారణ సమయంలోనే నిందుతులు మరి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఎందుకు దాడి చేశారు..? ఎవరు దాడి చేయమని చెప్పారు అని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలిచ్చారు.
"మేం ఏ సంస్థకూ చెందిన వాళ్లం కాదు. మేం విద్యార్థులం, నిరుద్యోగులం. మా తల్లిదండ్రులు తోచిన పని చేసుకుని బతుకీడుస్తున్నారు. మాకు ఉద్యోగాల్లేవు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే మా గొంతు నొక్కేస్తున్నారు. అందుకే ఇలా చేశాం"
- నిందితులు
దాదాపు 18 నెలలుగా ఈ దాడి కోసం ప్లాన్ చేస్తున్నట్టు విచారణలో తేలింది. అంతే కాదు. ఈ నిందితులంతా సోషల్ మీడియా పేజ్ Bhagat Singh Fan Club ని ఫాలో అవుతున్నారు. ఈ దాడి చేసే ముందు నిందితుల్లో కొందరు సోషల్ మీడియాలో మహిళా రిజర్వేషన్‌లు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన పోస్ట్‌లు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు కూడా పెట్టారు.