మోదీ పర్యటన తరవాత లక్షద్వీప్‌కి పెరిగిన పాపులారిటీ, పర్యాటకానికి ఫుల్ డిమాండ్
Lakshadweep Tourism: ప్రధాని మోదీ పర్యటన తరవాత లక్షద్వీప్‌కి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
PM Modi Lakshadweep Visit: ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి సముద్ర తీరాన కాసేపు సేద తీరారు. స్నోర్కెలింగ్ కూడా చేశారు. ఈ పర్యటనకు (Lakshadweep Tourism) సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ పర్యటన తరవాతే మాల్దీవ్స్ భారత్‌పై నోరుపారేసుకోవడం, ఆ తరవాత కొందరు భారతీయుల మాల్దీవ్స్ ట్రిప్‌ని బాయ్‌కాట్ చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. అయితే...మోదీ విజిట్ తరవాత లక్షద్వీప్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఈ విషయాన్ని టూరిజం అధికారులే స్వయంగా వెల్లడించారు. చాలా మంది ఇక్కడికి ట్రిప్‌కి వచ్చేందుకు చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నట్టు చెబుతున్నారు. కేవలం భారత్ నుంచే ఇంటర్నేషనల్ టూరిజం మార్కెట్ నుంచి లక్షద్వీప్‌కి మంచి డిమాండ్ ఉంటోందని అక్కడి టూరిజం విభాగం స్పష్టం చేసింది. అయితే...ఈ డిమాండ్‌కి తగ్గట్టుగానే ఇక్కడి టూరిజం రంగంలో పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. క్రూజ్ షిప్ కంపనీల ద్వారా టూరిజంని మరింత ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఇక భారత్‌లోని పలు చోట్ల నుంచి ఇక్కడికి ఫ్లైట్ సర్వీస్‌లూ నడుస్తున్నాయి. అయితే..గతంలో కన్నా ఇప్పుడు వీటకి డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్లైట్‌ల సంఖ్య పెంచితే లక్షద్వీప్ పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి లక్షద్వీప్‌కి వచ్చేందుకు చాలా మంది గతంలో ఎంక్వైరీలు చేసినప్పటికీ ఇక్కడి వసతులపై అనుమానాలతో ఆ ప్రయాణాల్ని మానుకున్నారు. కానీ...ఎప్పుడైతే మోదీయే స్వయంగా పర్యటించారో అప్పటి నుంచి అందరిలోనూ నమ్మకం పెరిగింది. జనవరిలో ప్రధాని మోదీ పర్యటించిన సమయంలోనే భారత విదేశాంగ శాఖ కీలక విషయం వెల్లడించింది. లక్షద్వీప్ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా మోదీ ఇక్కడ పర్యటించారని స్పష్టం చేసింది. అప్పటి వరకూ లక్షద్వీప్ గురించి పెద్దగా ఆరా తీసిన వాళ్లెవరూ లేరు. కొద్ది నెలలుగా ఈ ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. మాల్దీవ్స్ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకుని మరీ లక్షద్వీప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు కొందరు పర్యాటకులు.
Alliance Air సంస్థ కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్‌కి వెళ్లాలనుకునే ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా మరి కొన్ని ఫ్లైట్‌లను నడుపుతామని ప్రకటించింది. అఫీషియల్ X అకౌంట్‌లో ఈ విషయం వెల్లడించింది. Alliance Air కంపెనీ ఇప్పటికే రోజూ లక్షద్వీప్‌కి ఫ్లైట్ సర్వీస్‌లు నడుపుతోంది. 70 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే...గతేడాది మార్చి నుంచి ఈ ఫ్లైట్స్‌కి ఫుల్ డిమాండ్ ఉంటోందట. మొత్తం సీట్‌లన్నీ బుక్ అయిపోతున్నాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని అదనంగా ఫ్లైట్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. వారానికి రెండు రోజులు ఆదివారం, బుధవారం ఈ ఎక్స్‌ట్రా ఫ్లైట్స్ నడుపుతామని తెలిపింది. కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్‌లోని అగత్తి ద్వీపం వరకూ ఈ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి.
Also Read: బెంగాల్‌లో NIA అధికారులపై మూకదాడి, కార్ అద్దం ధ్వంసం - ఒకరికి గాయాలు