Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు
Kurnool Crime News: మద్యం తాగొద్దు మంచిది కాదని చెప్పిన తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఫుల్లుగా తాగొచ్చి మత్తులో కన్నతండ్రినే గొడ్డలితో నరికి చంపాడో కుమారుడు. అనంతరం వీధుల్లో తిరుగుతూ కలకలం రేపాడు.
Kurnool Crime News: కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నర్సింహులు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వస్తూ.. మద్యం మత్తులో తల్లి దండ్రులను వేధించేవాడు. సహించలేని తండ్రి కొవ్వు ఈరయ్య పలుమార్లు మందలించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నర్సింహులు.. ఎలాగైనా తండ్రిని హతమార్చాలకున్నాడు. ఫుల్లుగా తాగొచ్చాడు. మద్యం మత్తులోనే అర్ధరాత్రి పడుకున్న తండ్రి గొంతుపై గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా చంపాడు. అయితే విషయం గుర్తించిన భార్య రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వృద్ధాప్యంలో తమకు సాకాల్సిన కుమారుడు... తాగుడుకు బానిసై తండ్రిని చంపడాన్ని అస్సలే తట్టుకోలేకపోతుంది.
అయితే తండ్రిని నరికి చంపిన తర్వాత రక్తపు మరకలతో ఉన్న గొడ్డలిని పట్టుకొని నర్సింహులు గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. అయితే అతడి అరాచకాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. నిత్యం తల్లి దండ్రులను వేధిస్తున్న కొడుకును పద్దతి మార్చుకోవాలని సూచించినందుకు కన్నతండ్రిని హత్యం చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిడ్డ నల్లగా ఉందని.. భార్యను చంపేసిన భర్త..
బిడ్డ నల్లగా పుట్టిందనే కారణంతో ఓ ప్రబుద్ధుడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. బిడ్డ కళ్ల ఎదుటే తన ఆలిని అంతం చేశాడు. తర్వాత.. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిందని నమ్మబలికాడు. అందరూ సహజంగా మరణించిందనే అనుకున్నారు. కానీ తన మూడేళ్ల బిడ్డ నోటి నుంచి తన తల్లి ఎలా చనిపోయిందన్న విషయం బయటకు రావడంతో జైలుకు వెళ్లాడు. అసలేం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ సిటీ పరిధిలోని సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్ కు కారాగావ్ అనే గ్రామానికి చెందిన లిపికా మండల్ తో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తర్వాత ఆ దంపతులు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల క్రితం ఓ పాప జన్మించింది. ఐతే తాను, తన భార్య ఇద్దరూ తెల్లగా ఉండటం, పాప మాత్రం నల్లగా ఉండటంతో మాణిక్ ఘోష్ కు భార్య లిపికాపై అనుమానం వచ్చింది. ఈ విషయంపై తరచూ భార్యతో గొడవ పడే వాడు మాణిక్ ఘోష్. క్రమంగా తన అనుమానం పెరిగి పెద్దది అయింది. మాణిక్ రోజురోజుకూ విపరీతంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన లిపికా జనవరిలో తన పుట్టింటికి వెళ్లి పోయింది.
వచ్చీరానీ మాటలతో తాతకు విషయాన్ని చెప్పిన చిన్నారి..
పుట్టింటికి వచ్చిన లిపికాను తల్లిదండ్రులు సర్దిచెప్పి కాకినాడకు కాపురానికి పంపారు. ఐతే సెప్టెంబరు 18వ తేదీన రాత్రి లిపికాకు మూర్చ వచ్చింది. దీంతో భర్త మాణిక్ అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు లిపికాను పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. మూర్చ వల్లే లిపికా చనిపోయిందని నమ్మబలికాడు. కానీ మెడపై కమిలిపోయినట్లు గుర్తించారు వైద్యులు. ఇదే విషయాన్ని కాకినాడ పోలీసులు చెప్పారు. తర్వాత లిపికా తల్లిదండ్రులు కాకినాడ వచ్చి చిన్నారిని తమతో పాటు తీసుకెళ్లారు. అసలు లిపికా ఎలా చనిపోయిందో తెలుసుకుందామని.. చిన్నారిని తన తల్లి ఎలా ప్రాణాలు కోల్పోయిందో అడిగే ప్రయత్నం చేశారు. తాతకు ఆ చిన్నారి విస్తుపోయే నిజాలు బయట పెట్టింది. తన తండ్రే గొంతు పట్టుకున్నాడని.. అమ్మ కాళ్లు, చేతులు కొట్టుకుందని.. తర్వాత అమ్మ కదలకుండా నిద్ర పోయిందని వచ్చీ రానీ మాటలతో ఆ చిన్నారి తన తాతకు అన్ని విషయాలు చెప్పింది. దీంతో ఆ తాత తన మనవరాలిని పట్టుకుని కాకినాడకు వచ్చి పోలీసుల వద్దకు వెళ్లాడు. పోలీసుల ముందు కూడా ఆ చిన్నారి, తన తల్లిని తండ్రి ఎలా చంపాడో చెప్పింది. పోలీసులు మాణిక్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తను నిజంగానే తన భార్య లిపికాను చంపినట్లు ఒప్పుకున్నాడు.