KRM GRMB Meet: కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాల భేటీ... ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం
కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. రెండు రాష్ట్రాలు ఇచ్చే అంశాల ఆధారంగా గెజిట్ అమలు ఉంటుందని ఉపసంఘాల కన్వీనర్‌లు తెలిపారు
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ముందడుగు పడింది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. ఏ ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలో నిర్వహించాలన్నది తేలాకే సీఐఎస్‌ఎఫ్ భద్రతపై చర్చిద్దామని తెలిపాయి. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా డిపాజిట్ చేసే అంశాన్ని ప్రభుత్వాలతో చర్చించా వెల్లడిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డులకు తెలిపారు.
ఉపసంఘాల సమావేశంలో
శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాలు సమావేశం హైదరాబాద్ లో జరిగింది. రెండు రాష్ట్రాలు ఇచ్చే అంశాల ఆధారంగా బోర్డు స్వరూపాలు ఖరారు చేసి బోర్డులకు అందజేస్తామని ఉపసంఘాల కన్వీనర్‌లు తెలిపారు. బోర్డుల పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు ఉపసంఘాలను నియమించాయి. ఈ రెండు ఉపసంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. కృష్ణా బోర్డు ఉప సంఘానికి రవికుమార్ పిళ్‌లై, గోదావరి బోర్డు ఉప సంఘానికి బీపీ పాండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఉపసంఘాల సమావేశాల్లో బోర్డు సభ్యులు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
23 లోగా వివరాలు ఇవ్వండి
కృష్ణా బోర్డు ఉప సంఘం సమావేశం ముందుగా జరిగింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పాజెక్టుల వివరాలు కృష్ణా బోర్డుకు అందజేసింది. తెలంగాణ అధికారులు ఈ నెల 23లోగా ప్రాజెక్టులు, కాల్వల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నిచర్‌తో సహా వివరాలను అందించాలని ఉపసంఘం కన్వీనర్ రవికుమార్ పిళ్‌లై ఆదేశించారు. వీటితో పాటు నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, నిర్వహణ ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని విడుదల చేసేటప్పుడు లెక్కిస్తున్న నేపథ్యంలో దాని దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ సీఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ దీనిని వ్యతిరేకించారు. గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు అన్ని వివరాలు అందజేయాలని కన్వీనర్ రవికుమార్ పిళ్‌లై ఇరు రాష్ట్రాల అధికారులను కోరారు.
20న మళ్లీ సమావేశం
గోదావరి పరివాహక ప్రాజెక్టుల వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు అందించారు. ప్రాజెక్టుల వివరాలు తక్షణమే అందజేయాలని తెలంగాణను గోదావరి బోర్డు ఉపసంఘం కన్వీనర్ బీపీ పాండే ఆదేశించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 14 నుంచి అమలు చేయాల్సిన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపాన్ని తక్షణమే ఖరారు చేయాల్సిఉందన్నారు. ఈ నెల 20న మళ్లీ ఉపసంఘం సమావేశం నిర్వహిస్తామన్నారు.