AP Night Curfew: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... మళ్లీ నైట్ కర్ఫ్యూ పొడిగింపు... నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షల్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005, భారత శిక్షా స్మృతి సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.
మాస్కులు లేకపోతే జరిమానా
అలాగే పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే అనుమతించాలని సీఎం జగన్ ఆదేశించారు. తెల్లవారు జామున జరిగే పెళ్లిళ్లలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేశారు. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే జరిమానా విధిస్తున్నారు. జరిమానాని అక్కడి పరిస్థితుల ఆధారంగా విధిస్తారు. అలాగే 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థను మూసివేస్తారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
వ్యాక్సినేషన్ వేగవంతం
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసింది. గత వారం కరోనా కేసులు వెయ్యి దిగువన వచ్చేవి. కానీ ఈ వారం ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 1,393 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 8 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు
కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 20,33,284 కు గాను శుక్రవాం ఉదయం వరకు 20,04,435 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారంతో పోల్చితే యాక్టివ్ కేసులు పెరిగాయి. ఏపీలో ప్రస్తుతం 14,797 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.