Kolkata: గుండె పగిలిపోయింది, కలలు చెదిరిపోయాయి - ABP స్పెషల్ ఇంటర్వ్యూలో కోల్‌కత్తా డాక్టర్ తల్లిదండ్రులు
Kolkata Case: న్యాయం జరుగుతుందన్న భరోసా ఉందని కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు వెల్లడించారు. ABP న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు మాట్లాడారు.
Kolkata Doctor Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగిందన్న అనుమానాలతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే...దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం జరగాల్సిందేనని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంత అరాచకానికి పాల్పడిన వాళ్లని ఉరి తీయాలని తేల్చి చెబుతున్నారు. రక్తం ఉడికిపోతోందని నినదిస్తున్నారు. వాళ్లకే అలా ఉంటే...బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కూతురి మృతదేహాన్ని చూసేందుకు మూడు గంటల పాటు కూర్చోబెట్టారు హాస్పిటల్ అధికారులు. ఆ రోజుని తలుచుకుని ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ..ఎక్కడా ధైర్యం మాత్రం కోల్పోవడం లేదు. కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఉందని ABP News కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు బాధితురాలి తల్లిదండ్రులు.
ప్రశ్న: "మీకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఉందా?
జవాబు: ఎవరో ఒకరిపైనా నమ్మకం ఉంచి తీరాలి. హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. కచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. నేను ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నానో అని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. నమ్మకో కోల్పోతే ఇంకే పోరాటం చేయగలం. ఇవాళ కోట్ల మంది వచ్చి మాకు మద్దతుగా ఉన్నప్పుడు మేం ధైర్యంగానే ఉండాలిగా.
ప్రశ్న: చివరిసారి మీ కూతురుని చూసినప్పుడు మీకేం అనిపించింది..?
జవాబు: ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు అది మాటల్లో వివరించడమూ కష్టమే. ఇన్నేళ్లు కూతుర్ని ఎంతో కష్టపడి పెంచుకున్నాం. ఎన్నో కలలు కన్నాం. ఆ కలలన్నీ చెదిరిపోయాయి. ఇంత కన్నా ఏం చెప్పలేను (కన్నీళ్లు పెట్టుకుంటూ). నా గుండె పగిలిపోయింది.
ప్రశ్న: అమ్మా..మీరు చెప్పండి. మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా..?
జవాబు: నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నా కూతురిని ఆ పరిస్థితిలో చూసి నోట మాట రాలేదు. మాకు న్యాయం జరిగితే తప్ప తన ఆత్మ శాంతించదు. ఇవాళ దేశమంతా మాకు అండగా నిలబడింది.
ప్రశ్న: ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం మీకు జరుపుకోవాలని అనిపించిందా..?
జవాబు: ఇవాళ ఎంతో మంది స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోలేదు. మా కూతురికి మద్దతుగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహిళల రక్షణ గురించి మాట్లాడారు. కానీ కేవలం మాటలు చెబితే సరిపోదు కదా. కచ్చితంగా ఇది జరిగి తీరాలి.
ప్రశ్న: హాస్పిటల్‌లో ఇబ్బంది ఉన్నట్టు మీ కూతురు ఎప్పుడైనా మీకు చెప్పిందా..?
జవాబు: ఓ సీనియర్ కింద నా కూతురు పని చేసేది. అతని వల్ల కాస్త ఇబ్బంది పడింది.
ప్రశ్న: ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడ్డారని మీరనుకుంటున్నారా..?
జవాబు: దీనిపై మేము ఏమీ మాట్లాడలేము.
Also Read : అమ్మాయిలు బయటకు వెళ్లేప్పుడు ఈ వస్తువులు తప్పక తీసుకెళ్లండి.. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉండాలి..