KCR Meet Amit Shah : ఐపీఎస్ అధికారుల్ని పెంచండి.. అమిత్ షాకు కేసీఆర్ విజ్ఞప్తి !
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రితో అరగంటకుపైగా సమావేశం అయ్యారు. తెలంగాణకు చెందిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఐపీఎస్ అధికారుల కొరత గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అరగంటకుపైగా జరిగిన సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో పోలీస్ వ్యవస్థ సంస్కరణ గురించి ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం గురించి అమిత్ షాకు వివరించా ఐపీఎస్ అధికారుల అవసరాన్ని నొక్కి చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు కేటాయింపులు జరుగుతున్న ఐపీఎస్ అధికారుల సంమఖ్య సరిపోవడం లేదని కనీసం 40 శాతం వరకూ పెంచాలని విజ్ఞాపన పత్రం సమర్పించారు. ప్రస్తుతం తెలంగాణకు 139 మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపు ఉంది. ఈ సంఖ్యను 195కు పెంచాలని కోరారు. తెలంగాణ పోలీస్ క్యాడర్‌లో చేయాల్సిన మార్పుల గురించి పూర్తి విరవాలను హోంశాఖకు సమర్పించారు.
Also Read : హుజురాబాద్ ఉపఎన్నికలు దసరా తర్వాతే..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన సమావేశంలోనూ కేసీఆర్ ప్రధానగా పోలీసు వ్యవస్థ సంస్కరణలు, ఐపీఎస్ అధికారుల అవసరం గురించే చెప్పినట్లుగా సమాచారం. ఆ మేరకు ప్రధానమంత్రి ఈ విషయాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించడంతో ఆయన అమిత్ షాతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల కేటాయింపులతో పాటు విభజన హామీలపైనా కేసీఆర్ అమిత్ షాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అనేక ప్రాజెక్టులు ఇంత వరకూ పట్టాలెక్కలేదు. కొన్ని మంజూరు చేసినా ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వీటి మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఏర్పడుతున్న అడ్డంకుల విషయంలోనూ అమిత్ షాతో కేసీఆర్ చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూంటారు. అయితే ఆయా ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపరు. అలాంటివి తెలంగాణలోనూ పలు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పనులు ఎలా చేపట్టాలన్నదానిపైనా కేసీఆర్ అమిత్ షాతో చర్చించారు.
Also Read : కరోనా తర్వాత మొదటి సారిగా విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ
ఇరువురి మధ్య భేటీలో రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతో భేటీలో పెద్దగా తెలంగాణకు చెందిన అధికారులెవరూ లేరు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనూ కేసీఆర్ ముఖాముఖి చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది. అమిత్ షాతోనూ ఆయన ఏకాంతంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్బంగా తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తొమ్మిది నెలల కిందట ప్రధానమంత్రితో భేటీ తర్వాత కేసీఆర్ బీజేపీతో సాఫ్ట్‌గా రాజకీయం చేస్తున్నారు. రణం లేదు రాజీ లేదని ప్రకటించారు. ఇక ముందుకూడా అదే పద్దతి కొనసాగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.