Karnataka Hijab Row: కర్ణాటకలో 3 రోజుల పాటు విద్యాసంస్థలు బంద్.. రాళ్లు రువ్వుకున్న విద్యార్థులు
హిజాబ్ వివాదం కర్ణాటకలో ముదురుతోంది. ఈరోజు ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
కర్ణాటకలోని హైస్కూళ్లు, కళాశాలల్ని మూడు రోజులు మూసేయాలని ఆదేశించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. రాష్ట్రంలో హిజాబ్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయండంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాళ్ల దాడి..
కొన్ని రోజులుగా హిజాబ్‌పై రాష్ట్రంలో ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు శివమొగ్గలోని ప్రభుత్వ డిగ్రీ కళాళాల వద్ద ఆందోళనకు దిగిన ఇరు వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. ఎస్పీ కూడా పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లారు.
కాషాయ శాలువాలు ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజ్‌లోకి అనుమతించకపోవడం వల్ల వాళ్లు బయట నిరనసన చేపట్టారని, అనంతరం మరో వర్గం విద్యార్థులు అక్కడకు రావడం హింసకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
విజయపురలోనూ క్లాస్‌లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతేశ్వర ప్రీ యూనివర్సిటీ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. అయితే సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం క్లాసులు సస్పెండ్ చేసి సెలవు ప్రకటించింది యాజమాన్యం.
విచారణ వాయిదా..
మరోవైపు ఉడుపి ప్రీ-యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు.. తాము హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అనంతరం విచారణను బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది న్యాయస్థానం
Also Read: Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ X కాషాయ కండువా.. వ్యవహారంపై హైకోర్టు ఏమందంటే?
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు