Yediyurappa Resignation: కొత్త సీఎం వేటలో భాజపా.. కర్ణాటకకు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్
కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. కొత్త సీఎం ఎంపికపై భాజపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పార్టీ తరఫున పరిశీలకులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ ను కర్ణాటకకు పంపింది.
![Yediyurappa Resignation: కొత్త సీఎం వేటలో భాజపా.. కర్ణాటకకు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ Karnataka BJP Crisis Dharmendra Pradhan Kishan Reddy central observers Next CM Yediyurappa Resignation Yediyurappa Resignation: కొత్త సీఎం వేటలో భాజపా.. కర్ణాటకకు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/6ae7427fff17f29047983100cd06e71e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రి ఎంపికపై వేగంగా కసరత్తు జరుగుతోంది. నేడు భాజపా ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రాత్రి 7 గంటలకు బెంగళూరులోని క్యాపిటల్ హోటల్‌లో జరిగే ఈ భేటీలో నూతన సీఎం ఎంపికపై చర్చ జరగనుంది. మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌లను కేంద్ర పరిశీలకులుగా పార్టీ నిర్ణయించింది. వీరిద్దరూ నేడు బెంగళూరు వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. శాసనసభాపక్ష సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సీఎం రేసులో..
కొత్త సీఎం రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ జోషి, బి.ఎల్.సంతోశ్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, బసవరాజ బొమ్మై, సీటీ రవి, సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో యడియూరప్ప వంటి శక్తిమంతమైన నేత స్థానాన్ని భర్తీ చేయాలంటే అంత సులువు కాదని పార్టీ పెద్దలకు తెలియంది కాదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, సామాజిక బలం, నాయకత్వ లక్షణం, ఉత్తర ప్రాంతవాసం.. వంటి సకల గుణాలున్న నేతను గుర్తించేందుకు దిల్లీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు మొదలైంది. మరోవైపు 2023లో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రహ్లాద్ జోషి, బి.ఎల్.సంతోశ్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, తేజస్వి సూర్యకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, నాయకత్వ లక్షణాలున్నా కేవలం రెండు శాతం ఓటు బ్యాంకు ఉన్న బ్రాహ్మణ సముదాయానికి చెందినవారు. బసవరాజ బొమ్మై లింగాయత్ సముదాయానికి చెందినా నాయకత్వ లక్షణాలు, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కొరత కనిపిస్తోంది. బసవనగౌడ యత్నాళ్ ఉత్తర కర్ణాటక, లింగాయత్ సముదాయానికి చెందినా రాజకీయ నేతకు ఉండాల్సిన లౌక్యం మచ్చుకైనా లేదనేది అధిష్ఠానం మదింపు. ఇదే లక్షణాలున్న అరవింద బెల్లద్‌కు రాజకీయ అనుభవం కొరత.
దిల్లీ చుట్టూ చక్కర్లు చేస్తున్న మురుగేశ్ నిరాణి లింగాయత్ సముదాయంతో పాటు అర్థ, అంగ బలం ఉన్నా ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు పార్టీలోని అత్యధికులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. డబ్బు బలం విపరీతంగా ఉన్న ఆయనకు చెప్పలేనన్ని సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజీనామాకు కూడా సిద్ధమని సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి గోవింద కారజోళ చెప్పటం గమనార్హం. ఇక ఒక్కలిగర సముదాయానికి చెందిన సి.టి.రవి కలుపుగోలు తనం లేని నేతగా, యడియూరప్ప వర్గానికి వ్యతిరేకిగా గుర్తింపు పొందారు. ఇదే సముదాయానికి చెందిన ఆర్.అశోక్, అశ్వత్థ నారాయణలకు బెంగళూరుకు పరిమితమైన నేతలన్న మచ్చ ఉంది. పార్టీలో సమతౌల్యాన్ని కాపాడే దిశగా కనీసం నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించే అవకాశం ఉంది. సీఎం పదవి తప్పినా సముదాయాలను సముదాయించే దిశగా ఆయా వర్గాల కీలక నేతలకు డీసీఎం పదవులు దక్కే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)