Kanwar Yatra: కన్వార్ యాత్ర వివాదంలో యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, ఉత్తర్వులు ఆపేయాలని నోటీసులు
Kanwar Yatra Row: కన్వార్ యాత్ర వివాదంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Kanwar Yatra Controversy: కన్వార్ యాత్ర వివాదంపై (Kanwar Yatra Row) సుప్రీంకోర్టు యోగి సర్కార్‌కి షాక్ ఇచ్చింది. యాత్ర జరిగే దారిలో షాప్‌లు కచ్చితంగా నేమ్‌బోర్డ్‌లు పెట్టుకోవాలని, ఓనర్ల పేర్లు కూడా రాయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై అసహనం వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని తేల్చి చెప్పింది. ఫుడ్ షాప్‌లలో నేమ్ బోర్డ్‌లలో కేవలం మెనూ మాత్రమే డిస్‌ప్లే చేస్తారని, పేర్లతో పనేముందని ప్రశ్నించింది. జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ SVN భట్టితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీతో పాటు ఇవే ఉత్తర్వులు ఇచ్చిన ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరిపింది. ఈ విచారణ సమయంలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ఎలాంటి అధికారం లేకుండానే ఈ ఉత్తర్వులు జారీ చేశారని, చట్టపరంగా ఇలాంటివి ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని తేల్చి చెప్పారు.
"ఇవి పూర్తిగా ప్రజల్ని తప్పుదోవపట్టించే ఉత్తర్వులు. హోటల్ యజమానులు పేర్లు డిస్‌ప్లే చేయకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. వేలాది కిలోమీటర్ల పొడవునా యాత్ర జరుగుతుంది. ఆ దారిలో ఎన్నో దుకాణాలున్నాయి. వాళ్లంతా ఎలా బోర్డ్‌లు పెడతారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతుకున్న వాళ్లున్నారు. ఓ హోటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి మెనూని చూస్తాం కానీ మనకి సర్వ్ చేసే వాళ్లు ఎవరని ఆలోచిస్తామా. ఓ వర్గంపై కావాలని వివక్ష చూపించినట్టే అవుతోంది. ఇది ఏ మాత్రం రాజ్యాంగబద్ధం కాదు"
- అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ అడ్వకేట్
Supreme Court stays governments’ directive asking eateries on Kanwariya Yatra route to put owners' names and issues notices to Uttar Pradesh, Uttarakhand and Madhya Pradesh governments on petitions challenging their directive asking eateries on Kanwariya Yatra route to put… pic.twitter.com/6GQKwY8OK4
— ANI (@ANI) July 22, 2024
ఎన్నో దశాబ్దాలుగా ఈ యాత్ర జరుగుతోందని, అన్ని వర్గాలూ ఒకరికొకరు సాయం చేసుకుని యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నాయని సింఘ్వీ వివరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ పోలీస్ కమిషనర్‌కీ ఈ అధికారాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కన్వార్ యాత్ర జరిగే దారిలో అన్ని షాప్‌లు ఓనర్ పేర్లు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఆ తరవాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాల నుంచే కాకుండా NDA మిత్రపక్షాలైన RLD, JDU నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.