Joshimath Sinking: జోషిమఠ్‌లో టెన్షన్ టెన్షన్, ఆ ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు
Joshimath Sinking: జోషిమఠ్‌లో ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు.
Joshimath Sinking:
700 ఇళ్లకు పగుళ్లు..
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఇంకా అలజడి తగ్గలేదు. దాదాపు నాలుగు రోజులుగా అక్కడి ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో...ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. దాదాపు 700 ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరో 86 ఇళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. మరో 100 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించారు. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లు, హోటళ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇప్పటికే గాంధీనగర్, పలికా మార్వారీ ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా కూలిపోయే దశలో ఉన్నాయి. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే...గాంధీనగర్‌లో 135 ఇళ్లపై పగుళ్లు కనిపించాయి. పలికా మార్వారీలో 35 ఇళ్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. లోవర్ బజార్‌లో 34,సింగ్‌ధర్‌లో 88,మనోహర్ భాగ్‌లో 112 ఇళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వీటితోపాటు ఆ ప్రాంతంలో ఇలాంటి స్థితిలో ఉన్న ఇళ్లన్నింటినీ కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే...ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ ఆ అంచనాలకు అనుగుణంగానే వర్షాలు కురిస్తే...జోషిమఠ్‌లో ఇప్పుడున్న దాని కన్నా ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. అధికారులు ఎలాంటి వ్యూహంతో ఇళ్లు కూల్చి వేస్తారన్నదీ తేలాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామనైతే ప్రభుత్వం ప్రకటించింది. కచ్చితంగా పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చింది. అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. అసలు ఇక్కడ ఎందుకిలా జరుగుతోందని తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
సుప్రీం కోర్టు విచారణ..
ఇప్పటికే జోషిమఠ్ పట్టణంలో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్లను, హోటళ్లను అధికారులు జేసీబీలతో కూల్చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబ్బంది కూల్చివేతలు షురూ చేసింది. ఇప్పటికే ఆ నివాసాల్లో ఉంటున్న ప్రజలకను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జోషిమఠ్ వాసులంతా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు జోషిమఠ్‌లో పగిలిన ఇళ్లు కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై జనవరి 16న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ముక్తేశ్వరానంద్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి నిర్ణయాన్ని తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి రోడ్లపై పగుళ్లు వచ్చాయి. సింగ్‌ధార్ వార్డులోని ఓ శివాలయం కుప్ప కూలింది. ఇళ్ల గోడలకూ పగుళ్లు వచ్చాయి. ఫలితంగా..స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందోనని భయపడి పోతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా...ప్రజలు మాత్రం ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
Also Read: Golden Globe Awards: చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ - 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్