Joshimath Sinking: జోషిమఠ్‌కు వానగండం తప్పదా? మంచు కూడా కురిసే అవకాశం - అధికారులు అలెర్ట్
Joshimath Sinking: జోషిమఠ్‌లో నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది.
Joshimath Snowfall:
భారీ వానలు..?
జోషిమఠ్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఈ సిటీని రీస్టోర్ చేయడం సాధ్యం కాదని ఇప్పటికే జియాలజిస్ట్‌లు స్పష్టం చేశారు. వందలాది ఇళ్లకు మార్క్ చేసి వాటిని తొలగిస్తున్నారు అధికారులు. స్లైడింగ్ జోన్‌లో ఉన్న కారణంగా...ఇక్కడి నిర్మాణాలు పూర్తిగా పట్టు కోల్పోయాయని చెప్పారు. ఇప్పటికే ఇక్కడి నుంచి ప్రజల్ని తరలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు వాతావరణ పరిస్థితులూ అనుకూలించేలా లేవు. మరో నాలుగైదు రోజుల్లో ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే...జోషిమఠ్ ప్రజలకు కష్టాలు రెట్టింపవక తప్పదు. ఈ ముప్పుని ముందుగానే ఊహించిన అధికారులు అలెర్ట్ ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, మంచు కూడా పడుతుందని చెబుతున్నారు. గతంలో ఓ సారి ఇలాగే వర్షాలు కురిసినప్పుడు ఇక్కడి ప్రజలు నరకం అనుభవించారు. పైకప్పు సరిగా లేక, బీటలు వారడం వల్ల ఇళ్లలో ఉన్నా నిలువునా తడిసిపోయారు. ఈ నెల 23 వ తేదీ తరవాత తీవ్రంగా మంచు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిస్తే..ఇప్పటికే పట్టు కోల్పోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు ఇంకాస్త ముందుగానే కూలిపోతాయి.
దాదాపు అన్ని ఇళ్లూ ఇలాగే నేలమట్టమై...జోషిమఠ్ శిథిలాల దిబ్బగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైతే అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఇళ్లకు క్రాక్ మీటర్లు పెట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తున్నారు. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సేఫ్ అనుకున్న బిల్డింగ్‌లలోనూ వీరికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్ల సంఖ్య 288 నుంచి 849కి పెరిగింది.
సుప్రీం కోర్టు నిరాకరణ..
జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. స్వామి అవిముక్తేశ్వరానంద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఉత్తరాఖండ్ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోందని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్ హైకోర్టు చేపడుతున్న విచారణ సరిపోతుందని, ఇకపై దీనిపై ఎలాంటి పిటిషన్‌లు వేయాలన్నా ఆ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. "గతంలో వేసిన పిటిషన్‌లలో ఉన్న డిమాండ్‌లే ఇందులోనూ ఉన్నాయి. వాటిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది" అని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. అయితే పిటిషనర్ మాత్రం ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని వాదించారు. భారీగా పరిశ్రమల్ని నెలకొల్పడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అంతే కాదు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తక్షణమే అక్కడి ప్రజలకు పరిహారం అందించి ఆర్థికంగా తోడ్పడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు అన్ని విధాలా సాయపడాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు మాత్రం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికే హైకోర్టు జోషిమఠ్‌లో నిర్మాణాలు ఆపేయాలన్న ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తు చేసింది.
Also Read: Twitter Revenue: భారీగా పడిపోయిన ట్విటర్ రెవెన్యూ, ప్చ్ మస్క్ మామకు ఏంటీ కష్టాలు!