JD Vance : ఒక్క పుస్తకంతో భారీ సంపాదన - ట్రంప్ డిప్యూటీ జేడీ వాన్స్ ఆస్తులు, ఆదాయం వివరాలు ఇవే
Chilukuri Usha JD Vance : తెలుగు మూలాలు ఉన్న ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్న జేడీ ఇవాన్స్ ఉపాద్యక్ష రేసులో ఉన్నారు. దీంతో ఆయన ఆదాయం, ఆస్తులు ఎంత అన్నదానిపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడిది. ఆ వివరాలు ఇవే
JD Vance Net Worth : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున డొనాల్డ్ ట్రంప్ మరో సారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ఎంపిక చేసుకున్నారు. గత ఎన్నికల్లో బైడెన్ తన డిప్యూటీగా.. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ను ఎంపిక చేసుకుని ఘన విజయం సాధించారు. ఇప్పుడు ట్రంప్.. భారతీయ యువతి అయిన ఉషా చిలుకూరిని పెళ్లి చేసుకున్న జేడీ వాన్స్ ను తన డిప్యూటీగా ప్రకటించుకున్నారు.
ట్రంప్ ప్రకటన తర్వాత జేడీ వాన్స్ , ఉషా చిలుకూరి దంపతుల గురించి ఎక్కువగాచర్చ జరుగుతోంది వారి వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన జేడీ వాన్స్ డబ్బు కోసం పరుగులు పెట్టలేదు. ఆయన దేశం కోసం ఎక్కువ సమయం కేటాయించారు. మొదట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పని చేశారు. ఆయన మంచి రచయిత కూడా. ఒక్క పుస్తకం ద్వారా ఆయన ఎక్కువ రాయల్టీ సంపాదిస్తారు.
ఓవరాల్ గా జేడీ వాన్స్ నెట్ వర్త్ ఐదు మిలియన్ డాలర్లు. 39 ఏళ్ల జేడీవాన్స్ తన పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఆయన పెట్టుబడుల ఫోర్ట్ ఫోలియోలో వంద కంపెనీల వరకూ ఉంటాయి అంచనా. హంటింగ్‌టన్ నేషనల్ బ్యాంక్, ఎక్స్ ఛేంజ్ ట్రేడ్ ఫండ్ షేర్స్, వాల్ మార్ట్ స్టాక్స్ తో పాటు బిట్ కాయిన్ లోనూ వాన్స్ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఓహియో సెనెటర్ గా ఉన్నారు. లక్షా 74వేల డాలర్లు అందుకుంటారు. ఉపాధ్యక్షుడిగా గెలిస్తే అది 2 లక్షల 35 వేల 100 డాలర్లకు పెరుగుతుంది.
జేడీ వాన్స్ మంచి రచయిత కూడా. ఆయన హిల్ బిల్లీ ఎలీజీ అనే పుస్తకాన్ని రాశారు. 2016లో ఇది పబ్లిష్ అయింది. ఈ పుస్తకం ద్వారా మూడేళ్ల కిందటి వరకూ 475,308 డాలర్ల ఆదాయం పొందారు. తర్వాత మరింత పెరిగి ఉంటుంది. ఈ పుస్తకం ఆయన జీవిత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. పలు కాలేజీల్లో స్పీచ్‌లు ఇవ్వడం ద్వారా కూడా ఆయన ఆదాయం పొందుతూ ఉంటారు. విద్యార్థులకు ఆయనతో గెస్ట్ లెక్చర్లు ఇప్పించేందుకు పలు కాలేజీలు ఆసక్తి చూపిస్తూంటాయి.
రాజకీయాలపై ఆసక్తి ఉన్న జేడీ వాన్స్ మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుదారుగా ఉన్నారు. డొనాల్డ్ మద్దతుతో జేడీ వాన్స్ 2022లో ఓహియో సెనెటర్ గా పోటీ చేసి గెలిచారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరి కూడా లా ప్రొఫెషనల్. ఆమె లిటిగేటర్ గా కొంత కాలం వర్క్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వద్ద పని చేశారు. భర్త రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేదోడువాదోడుగా ఉంటున్నారు.