Nagababu Applied For Vote: ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబు, వైసీపీ సంచలన ఆరోపణలు
Janasena Leader Nagababu: సినీ నటుడు, జనసేన నేత నాగేంద్ర బాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వైసీపీ నేతలు నాగబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.
Nagababu Casts his vote in Telangana Assembly Elections: తాడేపల్లి: తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే, ఏపీలో ఎన్నికల సందడి మొదలైనట్లు కనిపిస్తోంది. యువతతో పాటు నేతలు సైతం తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు, జనసేన నేత నాగేంద్ర బాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు నాగబాబు.
తెలంగాణలో ఓటు రద్దు చేసుకున్నారా..
జనసేన నేత నాగబాబు తెలంగాణలో ఓటు రద్దుకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వడ్డేశ్వరం గ్రామ సచివాలయంలో కొత్త ఓటు కొరకు ఫారం6 తో దరఖాస్తు చేశారు. అయితే ఆయన ఇచ్చిన డోర్ నెంబర్ లో విచారణ చేయగా తాళం వేసి ఉంది. దాంతో బూత్ లెవల్ ఆఫీసర్ పక్కన ఇంటి వారికి సమాచారం అందించారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబును తమ వద్ద హాజరు కావాలని బీఎల్వో తెలిపారు.
తెలంగాణలో నాగేంద్రరావు, ఏపీలో నాగేంద్రబాబు.. వైసీపీ సంచలన ఆరోపణలు
తెలంగాణ ఎన్నికల్లో నాగబాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుందని, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగబాబు కుటుంబం ఓటు వేసిందని.. పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు (సీరియల్ నెంబర్- 323), కొణిదెల పద్మజ (సీరియల్‌నెంబర్- 324), వరుణ్ తేజ్ (సీరియల్ నెంబర్ - 325) ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా, తెలంగాణలో ఓటు ఉండగా, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. పైగా తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేసిన జనసేన నేత ఏపీలో నాగేంద్రబాబుగా మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను ఆ పార్టీ పోస్ట్ చేసింది. నీతులు పక్క వాళ్లకు చెప్పడమేనా, మీరు ఏం పాటించడం లేదా అని వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రశ్నించారు.