(Source: ECI/ABP News/ABP Majha)
జమ్ముకశ్మీర్‌కి త్వరలోనే రాష్ట్ర హోదా, ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌కి త్వరలోనే రాష్ట్ర హోదా ఇస్తామని ప్రధాని మోదీ ఆసక్తికర ప్రకటన చేశారు.
Jammu Kashmir Statehood: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని వెల్లడించారు. అంతే కాదు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జమ్ముకశ్మీర్‌లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే పూర్తి సినిమా చూపిస్తామని తేల్చి చెప్పారు. ఇక్కడి ప్రజలు తమ కలలు నిజం చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భరోసా ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి ఉగ్రవాద భయం లేకుండా, హింసకు తావు లేకుండా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
"ఈ మోదీ ఎప్పుడైనా ముందుచూపుతోనే ఉంటాడు. ఇప్పటి వరకూ జమ్ముకశ్మీర్‌లో వచ్చిన మార్పులు ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో అందమైన సినిమాని చూపిస్తాం. ఇక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. రాష్ట్ర హోదా కూడా దక్కుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇక్కడి ప్రజలు ముఖాముఖి మాట్లాడొచ్చు. వాళ్ల ఆకాంక్షలేంటో చెప్పుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికలు రాళ్ల దాడి, ఉగ్రదాడి, హింసాత్మక వాతావరణం లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం నాకుంది. "
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | J&K: Addressing a public rally in Udhampur, PM Modi says, "Modi thinks far ahead. So what has happened so far is just the trailer. I have to get busy in creating a new and wonderful picture of the new Jammu and Kashmir. The time is not far when Assembly Elections will be… pic.twitter.com/F8aHgialRA
— ANI (@ANI) April 12, 2024
ఈ సమయంలోనే కాంగ్రెస్‌పైనా విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్ ప్రజల కష్టాల్ని తీర్చేందుకు ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టు గుర్తు చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణితో ఉందని మండి పడ్డారు. ఆర్టికల్ 370 ని మళ్లీ రాజ్యాంగంలోకి తీసుకొచ్చే ధైర్యం చేయాలంటూ కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు ప్రధాని మోదీ. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్నీ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండి పడ్డారు ప్రధాని మోదీ. రామ మందిరం అనేది ఎన్నికల అంశం కాదని తేల్చి చెప్పారు. విదేశీయులు కొందరు వచ్చి మన దేశంలోని ఆలయాలను ధ్వంసం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆలయాలను కాపాడుకునేందుకు చాలా మంది పోరాటం చేయాల్సి వచ్చిందని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలంతా పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నారని, కానీ అయోధ్య రాముడిని మాత్రం టెంట్‌లో పెట్టారని విమర్శించారు.
#WATCH | J&K: Addressing a public rally in Udhampur, PM Modi says, "Congress says Ram Mandir is an election issue for BJP. I want to say that Ram Mandir was never an election issue, nor it will ever become an election issue. The struggle for Ram temple was going on even before… pic.twitter.com/n7tPbJgnMC
— ANI (@ANI) April 12, 2024