Farooq Abdullah: రాముడు అందరి వాడు, కేవలం హిందువులకే పరిమితం చేయొద్దు - ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బీజేపీపై ఫైర్ అయ్యారు.
Farooq Abdullah on BJP:
బీజేపీపై ఫైర్..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బీజేపీపై ఫైర్ అయ్యారు. ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరైన ఆయన...పార్టీని కొందరు కావాలనే బలహీన పరిచేందుకు చూస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మత విద్వేషాలు పెంచుతున్నారని మండి పడ్డారు. ఇటీవలే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఫరూక్ అబ్దుల్లా. రిజైన్ చేశాక ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభలోనే...బీజేపీని టార్గెట్ చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ బీజేపీ "హిందువులు చాలా ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారు" అంటూ ప్రచారం చేస్తుంటారని, ఈ మాయ మాటలు నమ్మి మోసకూడదని సూచించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రాముడు అందరివాడు.
ఆయనను హిందూ మతానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు" అని వెల్లడించారు. ఏ మతమూ చెడు నేర్పించదని, ప్రజలే అలా తయారవుతారని తెలిపారు. "మాపై నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ మేమెప్పుడూ పాకిస్థాన్ సైడ్ తీసుకోలేదు. వారితో ఎప్పుడూ స్నేహం చేయలేదు. మా నాన్నను కలవడానికి జిన్నా వచ్చారు. కానీ మేము కనీసం ఆయనకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు" అని తేల్చి చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం..ఆ మాట నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు. "మనకు 50 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు..? ఆ హామీ ఏమైంది" అని ప్రశ్నించారు. ఇక్కడి వైద్యులు, నర్స్‌లు, పారామెడికల్ సిబ్బందితో పాటు చాలా మంది యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలోనే జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌మళ్లీ విలీనం అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే రాజీనామా..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ ప్రతినిధి తన్వీర్ సాదిక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఇందుకు గల కారణాలనూ వివరించారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం పాటు అధ్యక్ష పదవిలో కొనసాగడంపై ఆయన ఆసక్తి చూపడం లేదని, అందుకే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించారని చెప్పారు తన్వీర్ సాదిక్. శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో ఈ విషయం తెలిపారు. ఫరూక్ రాజీనామాతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంది. అయితే...ఇందుకోసం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది పార్టీ. డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లాకు ఈ అధ్యక్ష పదవిని కట్టబెడతారని అంటున్నారు. ప్రస్తుతానికి ఒమర్ అబ్దుల్లా...పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. త్వరలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రతినిధి తన్వీర్ సాదిక్ వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసే సమయంలో ఫరూక్ అబ్దుల్లా కంట తడి పెట్టుకున్నట్టు సన్నిహితులు చెప్పారు. కార్యకర్తలంతా సమష్టిగా పని చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారని అన్నారు.
Also Read: Gujarat Elections 2022: భాజపా షాకింగ్ నిర్ణయం- ఏడుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు!