(Source: ECI/ABP News/ABP Majha)
Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లోనూ బుల్‌డోజర్ల దూకుడు, ఉగ్రవాదుల ఇళ్లు నేల మట్టం
Jammu Kashmir: కశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు బుల్‌డోజర్లతో నేల మట్టం చేశారు.
Jammu Kashmir:
ఇళ్లు కూల్చేశారు..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్రం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే...అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంత్‌నాగ్‌లోని పహల్‌గామ్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ కమాండర్ ఆమిర్ ఖాన్ ఇంటిని బుల్‌డోజర్‌తో పడగొట్టేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ ఇల్లు కట్టినట్టు అధికారులు వెల్లడించారు. "గులాం నబీ ఖాన్ అలియాస్ ఆమిర్ ఖాన్ ఇల్లు కూల్చేశాం. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో ఆపరేషనల్ కమాండర్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో చాలా సార్లు పీఓకేని దాటుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే వాడు" అని తెలిపారు. అంతకు ముందు మరో ఉగ్రవాది ఇంటినీ కూల్చి వేశారు.
పుల్వామాలోని రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆశిక్ అహ్మద్ నెంగ్రూ అలియాస్ అంజీద్ భాయ్ ఇంటిని పడగొట్టారు. ఇది కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిందేనని అధికారులు చెప్పారు. అంజీద్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌లో భద్రతపై రాజీ పడేదే లేదని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సాధారణ పౌరులు ఎలాంటి భయాందోళనలకు
లోనుకాకుండా జీవించేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే...అధికారులు ఇలా ఉగ్రవాదుల ఇళ్లను టార్గెట్ చేసుకుని పడగొడ్తున్నారు.
Jammu and Kashmir Administration demolishes property of Hizbul Mujahideen terrorist commander Amir Khan, in Anantnag's Pahalgam pic.twitter.com/x1F28YFwAK
— ANI (@ANI) December 31, 2022
కశ్మీరీ పండిట్‌ల అసహనం..
కశ్మీరీ పండిట్‌లు ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తమను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోడం లేదని మండి పడుతున్నారు. దాదాపు ఆర్నెల్లుగా కశ్మీరీ పండిట్‌లపై ఉగ్ర దాడులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యుగుల్లోని పండిట్‌లు అప్పటి నుంచి నిరసన బాట పట్టారు. దీనిపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "విధుల్లోకి హాజరు కాకుండా ఇలా ధర్నాల్లో కూర్చుంటే జీతాలు ఇవ్వం" అని తేల్చి చెప్పారు. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం కశ్మీరీ పండిట్‌ల భద్రతకు భరోసా ఇచ్చింది. అందరూ మళ్లీ కశ్మీర్‌కు రావచ్చని పిలుపునిచ్చింది. ప్రభుత్వంపై భరోసా ఉంచిన కశ్మీరీ పండిట్‌లు వరుసగా జమ్ముకశ్మీర్ బాటపట్టారు. కొద్ది రోజుల వరకూ బాగానే ఉన్నా...మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. ఫలితంగా...వారిలో భయం పట్టుకుంది. స్పెషల్ ఎంప్లాయిమ్ంట్ స్కీమ్‌లో ఉద్యోగాలు లభించినప్పటికీ...ప్రశాంతత లేకుండా పోయిందని అంటున్నారు.