Israel Hamas War: చనిపోయిన 8 మంది ఇజ్రాయేల్ సైనికులు వీళ్లే, ఫొటోలు విడుదల చేసిన సైన్యం
Israel Hamas Conflict: హమాస్ దాడిలో చనిపోయిన సైనికుల ఫొటోలను ఇజ్రాయేల్ సైన్యం విడుదల చేసింది.
Isreal Soldiers Killed: ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధానికి (Israel Hamas War) తెరపడేలా కనిపించడం లేదు. పైగా రోజులు గడుస్తున్న కొద్ది అది తీవ్రతరమవుతోంది. ఇజ్రాయేల్‌కి దీటుగా హమాస్ ఎదురు దాడి చేస్తోంది. ఈ దాడిలోనే ఇజ్రాయేల్ సైన్యానికి చెందిన 8 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌లోని రఫాలో ఈ 8 మంది మృతి చెందినట్టు ఇజ్రాయేల్ అధికారికంగా ప్రకటించింది. కంబాట్ ఇంజనీరింగ్ యూనిట్‌కి చెందిన ఈ సైనికులపై దాడి (Rafah Attack) జరిగిందని, అక్కడికక్కడే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఈ సైనికుల ఫొటోలనూ విడుదల చేసింది. రఫాలోని Tel al-Sultan ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం దీనిపై ఇజ్రాయేల్ విచారణ మొదలు పెట్టింది. అయితే..హమాస్ వాదన మాత్రం మరోలా ఉంది. తాము దాడి చేయలేదని, మైన్‌ఫీల్డ్‌లోకి వాళ్ల వెహికిల్ వచ్చిందని అప్పుడో మైన్ పేలిపోయిందని చెబుతోంది. ఇజ్రాయేల్ మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రభుత్వంలోనూ ఈ యుద్ధం కారణంగా అనిశ్చితి మొదలైంది. నెతన్యాహు గాజాపై యుద్ధం చేయడంలో ఓ వ్యూహం అంటూ అమలు చేయడం లేదని మండి పడ్డారు జనరల్ బెన్నీ గంట్జ్. తరవాత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. ఇప్పటి వరకూ హమాస్‌తో యుద్ధం కారణంగా 307 మంది ఇజ్రాయేల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
అటు ఇజ్రాయేల్ కూడా రఫాపై దాడులు కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన దాడిల 19 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. రఫాలో చాలా వరకూ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయేల్ ప్రకటించింది. హమాస్ నిర్మించుకున్న నెట్‌వర్క్ టన్నెల్‌ని ధ్వంసం చేసి తీరతామని తేల్చి చెబుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు. ఆ దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని బంధించి తీసుకెళ్లారు. వీళ్లని విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 37 వేల మంది బలి అయ్యారు. గాజాలోని 80% జనాభా యుద్ధం భయానికి వలస వెళ్లిపోయారు. వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి తెరపడాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి.
దాదాపు 8 నెలలుగా ఇజ్రాయేల్,హమాస్ మధ్య ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. సంధికి చర్చలు జరుగుతున్నా అటు యుద్ధం మాత్రం ఆగడం లేదు. కండీషన్స్ పెట్టుకుంటున్నా వాటిని రెండు వర్గాలూ పాటించడం లేదు. రఫాలో హమాస్ ఉగ్రవాదులు భారీ ఎత్తున నక్కి ఉన్నారని వాదిస్తోంది ఇజ్రాయేల్. గతంలో ఇక్కడి నుంచి హమాస్ దాడులు చేశారని చెబుతోంది. అందుకే ఇక్కడ వాళ్ల ఉనికి లేకుండా చేస్తామని శపథం చేసింది. ఈ యుద్ధం తీవ్రతరం కాకుండా ఈజిప్ట్ కూడా గట్టిగానే ప్రయత్నించినా సఫలం కాలేదు. ఇజ్రాయేల్ చేసిన దాడిలో రఫాలోని ఓ క్యాంప్‌లో 45 మంది చనిపోయారు. అప్పటి నుంచి All Eyes on Rafah హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Also Read: NCERT బుక్స్‌లో కీలక మార్పులు, బాబ్రీ మసీదు పాఠం తొలగింపు - అయోధ్య వివరాలతో కొత్త పుస్తకం