ఇది కేవలం ముస్లింల సమస్య కాదు, మోదీ సాబ్ కాస్త ఆలోచించండి - పాలస్తీనా వివాదంపై ఒవైసీ
Israel Palestine Attack: పాలస్తీనా వివాదాన్ని కేవలం ముస్లింల సమస్యగా చూడొద్దని ఒవైసీ అన్నారు.
Israel Palestine Attack:
నెతన్యాహు ఓ డెవిల్..
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధంపై (Israel Hamas War) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుని డెవిల్ అని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ గాజా ప్రజల పట్ల సానుభూతి చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పాలస్తీనా పౌరులపై జరుగుతున్న ఈ దాడులను ఖండించాలని స్పష్టం చేశారు. దీన్ని కేవలం ముస్లింల సమస్యగా చూడొద్దని, మానవతా కోణంలో ఆలోచించి అందరూ మద్దతుగా నిలవాలని సూచించారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడు అని, నియంత అని తీవ్రంగా మండి పడ్డారు.
"పాలస్తీనా పౌరులపై జరుగుతున్న అఘాయిత్యాలని ఖండించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాను. పాలస్తీనా సమస్యని కేవలం ముస్లింల కోణంలోనే చూడొద్దు. మానవతా కోణంలో ఆలోచించి మద్దతుగా నిలవాల్సి అవసరముంది. నెతన్యాహు ఓ డెవిల్. నియంత, యుద్ధ నేరస్థుడు. దాదాపు 10 లక్షల మంది గాజా పౌరులు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. కానీ ప్రపంచమంతా ఈ విధ్వంసంపై నోరు మెదపడం లేదు. మీపై దాడి చేసిన వాళ్లెవరో కనిపెట్టి చంపండి. కానీ అక్కడి అమాయక పౌరులు ఏం చేశారు..? మీడియా కూడా ఈ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోంది. 70 ఏళ్లుగా ఇజ్రాయేల్ పాలస్తీనాని ఆక్రమిస్తూనే ఉంది. ఈ ఆక్రమణలు, అకృత్యాలు మీడియాకి కనిపించవా..?"
- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్
వారం రోజులుగా యుద్ధం..
అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయేల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. వేలాది మంది పౌరులు బలి అయ్యారు. ముఖ్యంగా గాజా ప్రాంతంలోని ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. ఒక్క గాజాలోనే 2,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ని అంతం చేసేంత వరకూ యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయేల్ తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం..గాజాలో 1,300 భవనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ లోకి వెళ్లి దాడులు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది. ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ ఈ దాడుల ఆలోచనలకు కారణమైందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడిదే వార్త ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఫౌదా అనే వెబ్ సిరీస్... ఇజ్రాయెల్-పాలస్తీనా దాడుల నేపథ్యంలో సాగుతోంది. ఈ ఏడాది విడుదలైన సీజన్ లోని నాలుగో ఎపిసోడ్ హమాస్ ఇజ్రాయెల్ పైన మూడు వైపుల నుంచి దాడులకు పాల్పడతారు. అచ్చం అలానే హమాస్ నిజంగా ఇజ్రాయెల్ పై దాడి చేశారని వస్తున్న వార్తలపై ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ హన్నీ భక్షి వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు ‘ఫౌదా’ సిరీస్‌లోని నటులు కొందరు ఇజ్రాయెల్‌కు మద్దతుగా సైన్యంలో కూడా చేరుతున్నారు.
Also Read: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం ఆపడం మోదీ వల్లే అవుతుంది - ABP తో పాలస్తీనా రాయబారి అద్నాన్