US Airstrike in Syria: సిరియాలో అమెరికా వైమానిక దాడి- ఇద్దరు టాప్ ISIS ఉగ్రవాదులు హతం!
US Airstrike in Syria: సిరియాలో అమెరికా చేసిన వైమానిక దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
US Airstrike in Syria: ఉగ్రవాదంపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. సిరియాలో ఉగ్రవాదులు పాగా వేసిన ఓ గ్రామంపై అమెరికా తాజాగా వైమానిక దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు అగ్రశ్రేణి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు.
పక్కా సమాచారంతో
సిరియాలోని ఈశాన్య ప్రాంతంలోని ప్రభుత్వ అధీనంలో ఉన్న ఒక గ్రామంపై అరుదైన యూఎస్ మిలటరీ హెలికాప్టర్ దాడి చేసింది. ఉత్తర సిరియాలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అబూ-హషుమ్ అల్-ఉమావి అనే నాయకుడితో సహా ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ సభ్యులు హతమైనట్లు యూఎస్ మిలిటరీ తెలిపింది. తాము జరిపిన వైమానిక దాడిలో సిరియా పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
టార్గెట్ ఇదే
అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని ఇటీవలే అమెరికా సైన్యం హతమార్చింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో ఆగస్‌లో జరిపిన డ్రోన్ దాడిలో జవహరీని మట్టుబెట్టింది అమెరికా సైన్యం.
ఈ ఆపరేషన్‌కు బైడెన్ జులై 25న ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను అమెరికా సైన్యం విజయవంతంగా చేపట్టింది. జవహరీ కాబుల్‌లోని తన నివాసంలో బాల్కనీలో ఉండగా రెండు హెల్‌ఫైర్ క్షిపణులు అతడిని లక్ష్యంగా చేసుకున్నాయి.
కేవలం జవహరీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టడంతో భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. ఈ దాడిలో కేవలం జవహరీ మాత్రమే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో నిల్చున్నది జవహరీ అని ఆ అధికారి కన్ఫమ్ చేసిన తర్వాతే దాడి చేసింది. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో జవహరీ ఒకడు. లాడెన్ హతమైన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ చేపట్టాడు.
బైడెన్ వార్నింగ్
అమెరికా ప్రజల జోలికొస్తే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్ ఆ సమయంలో వార్నింగ్ ఇచ్చారు.
" అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్నా పట్టుకుంటాం. ఎంత కాలమైనా, ఏ మూల దాగి ఉన్నా కనిపెడతాం, వెంటాడతాం, వేటాడతాం. ఉగ్రవాదులే లేకుండా చేయడానికి అమెరికా కృషి చేస్తూనే ఉంటుంది. "