International Yoga Day 2023: "అందరికన్నా యోగే ఉన్నతుడు, యోగ ద్వారానే అది సాధ్యమవుతుంది"
International Yoga Day 2023: అందరికన్నా యోగే ఉన్నతుడు, యోగ ద్వారానే అది సాధ్యమవుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు.. అర్జునుడికి వివరించాడు. ఇదే విషయాన్ని పరమహంస యోగానంద కూడా తెలిపారు.
International Yoga Day 2023: క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వుల కన్న, జ్ఞాన మార్గాన్ని అనుసరించేవారి కన్న, కర్మ మార్గాన్ని అవలంభించే వారి కన్నా, యోగిని ఉన్నతుడుగా భావిస్తున్నారు కాబట్టి ఓ అర్జునా, నువ్వు యోగివి అవు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి వివరించాడు. ఇదంతా భగవద్గీతలో పొందుపరిచారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ పేరుతో భగవద్గీతకు బృహత్తరమైన వ్యాఖ్యానాన్ని రాశారు. ఈ వ్యాఖ్యానాన్ని ప్రతి ‘శ్రద్ధాళువైన అన్వేషకుడిలో ఉన్న అర్జునుడి’ కి అంకితమిచ్చారు. రాజ యోగాన్ని అన్ని ఆధ్యాత్మిక మార్గాల్లోనూ గొప్పదిగానూ, యోగాన్ని శాస్త్రీయంగా సాధన చేసే యోగి ఏ ఇతర ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారి కన్నా కూడా శ్రేష్టుడని పేర్కొన్న శ్రీకృష్ణుడి వాక్కును పరమహంస యోగానంద కూడా పునరుద్ఘాటించారు.
యోగం, లేదా ప్రాణశక్తి నియంత్రణ మార్గం అనేది ఆత్మ సాక్షాత్కారం కోసం. ఎద్దుల బండి ప్రయాణం వలె నెమ్మదిగా, అనిశ్చితంగా సాగే వేదాంతపరమైన అధ్యాత్మిక మార్గంతో పోలిస్తే... సూటిగా, దగ్గరి దారిలో సాగే విమాన మార్గం వంటిది. ‘అది మానవ పరిణామాన్ని వేగవంతం చేసే ఒక ఉపకరణం.’ తన ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ఒక యోగి ఆత్మకథలో క్రియా యోగమనే శాస్త్రీయ ప్రక్రియను శ్రద్ధగా సాధన చేసే యోగి క్రమేపీ కర్మ లేక ‘కార్య కారణాలను సమతూకం చేసే గొలుసుకట్టు అనుభవాల’ నుండి ఎలా విముక్తుడవుతాడో పరమహంస యోగానంద వివరించారు. గీతలో కృష్ణ పరమాత్మ రెండుసార్లు ప్రస్తావించిన.. ప్రాచీన విజ్ఞానమయిన క్రియా యోగాన్ని మరణం లేని హిమాలయ యోగి అయిన మహావతార్ బాబాజీ వెలికి తీశారు.
“ఈ 19వ శతాబ్దంలో నేను నీద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం, కొన్నివేల ఏళ్ల కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే”, బాబాజీ తన శిష్యుడయిన లాహిరీ మహాశయులతో మోక్షప్రదాలయిన ఈ పలుకులు ఉచ్చరించారు. లాహిరీ మహాశయులు ఈ ప్రక్రియను అనేక ఉత్కృష్ట శిష్యులకు బోధించారు. యోగానందుల గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి వారిలో ఒకరు. బాబాజీ 1894 సంవత్సరపు కుంభ మేళాలో స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిని కలిసి యోగ శాస్త్రంలో శిక్షణ ఇవ్వడానికి ఆయన వద్దకు ఒక శిష్యుడిని పంపుతానని, ఆయనే పాశ్చాత్య ప్రపంచంలో ఈ బోధలు వ్యాప్తి చెందిస్తారని చెప్పారు. అక్కడ ఆధ్యాత్మికంగా తపిస్తున్న ఎన్నో ఆత్మల స్పందనలు తన వద్దకు వెల్లువలా వస్తున్నాయని ఆయన కరుణతో పలికారు. ప్రాచీనమైన క్రియాయోగ శాస్త్రాన్ని ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులు ఆశించినట్టుగా తన శుద్ధమైన, సహజ స్వరూపంలో ప్రపంచానికందించే లక్ష్యంతో వందకు పైగా ఏళ్ల క్రితం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను యోగానందులు స్థాపించడం ద్వారా ఆ దివ్య వాగ్దానం నెరవేరింది.
క్రియాయోగాన్ని శ్రద్ధగా సాధన చేయడం వల్ల ఆత్మ శరీరంలోకి ఏ మార్గం గుండా అవరోహణ చెందిందో అదే వెనుబాము మార్గం గుండా అహంకారం, మనసు, ప్రాణశక్తి ప్రయాణిస్తాయి."ఆ విధంగా వెనుబాము మార్గం ఈ భూమి మీదకు దిగివచ్చిన మర్త్యులందరూ అంతిమ విముక్తి కోసం పైకి ప్రయాణించే ఒక రాజమార్గం” అని యోగానందులు నిశ్చయంగా చెప్పారు. నిజమైన యోగి తాను భగవంతుడితో అంతరిక అనుశ్రుతి సాధించే వరకు ధ్యానం చేస్తాడు. తద్ద్వారా అతడి బాహ్య కార్య కలాపాలు లేక సేవలు అహంకారంతో ప్రేరేపితమై కాకుండా తన బాహ్యాంతరిక జీవితాలకు సంబంధించిన అతి సూక్ష్మ విషయంలో కూడా దైవ సంకల్పానికి స్వచ్ఛందంగా కట్టుబడి ఉన్నవై ఉంటాయి. నిజమైన యోగి ఈశ్వరుడిని నిత్య స్థితుడు, నిత్య చైతన్యుడు, నిత్య నవీనానందముగా ఎరిగి ఉంటాడు. స్వామి శ్రీయుక్తేశ్వర్ ఇలా స్పష్టీకరించారు.
“విశ్వచైతన్య రహస్యం శ్వాసనియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. నిరంతరాయంగా సాగే శ్వాస నుంచి ప్రత్యేక పద్ధతి ద్వారా ప్రాణ శక్తిని.. శాంతపర్చడం, నిశ్చల పరచడం ద్వారా ఉన్నతమైన కార్యకలాపాల కోసం విముక్తం చేయాల్సి ఉంటుంది.” ఆ విధంగా యోగం అనేది ధ్యానం గురించిన విజ్ఞానం మాత్రమే కాదు. అది ఆత్మ పరిణామ శాస్త్రం. ఈ చిన్ని శరీరానికి బద్ధమైన అహంకారాన్ని శుద్ధమైన దివ్యాత్మగా మార్చే విజ్ఞానం. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు మానవ పరిణామానికి సంబంధించిన ఈ మౌలిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడంలో ప్రాచీన భారతదేశ పాత్రను మనం మరొకసారి గుర్తు చేసుకుందాం.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial