Intercourse Vs Rape : దంపతుల మధ్య శృంగారం అత్యాచారంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు !
"వైవాహిక అత్యాచారం" అంశంపై ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా జరిగిన విచారణలో దంపతుల మధ్య శృంగారాన్ని రేప్‌గా పరిగణించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
భార్యాభర్తల మధ్య శృంగారాన్ని అత్యాచారంగా చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ఇగోను సంతృప్తి పరచడానికి ఇరువురి మధ్య లైంగిక బంధాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షించడం నిర్బంధించడం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా శృంగారం చేస్తే... అంటే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా వాదనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
వైవాహిక అత్యాచారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాదిస్తున్న ఎన్జీవో తరపు న్యాయవాదులు దంపతుల వైవాహిక బంధంలో " లైంగిక వేధింపులు" కూరత్వం అవుతుందని వాదించారు. ఇలాంటివి గృహ హింస చట్టం సెక్షన్ 3 కిందకు వస్తాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. భర్త అయినప్పటికీ ఇష్టం లేకపోయినా శృంగారానికి ఒత్తిడి చేయడం 'స్త్రీ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి, అవమానపరిచి, కించపరిచే లైంగిక స్వభావ ప్రవర్తనగా " లాయర్ అభివర్ణించారు. వైవాహిక అత్యాచారం మినహాయింపు 'వివాహ వ్యవస్థ"ను రక్షించడం' లక్ష్యంగా ఉందని వాదించారు.
కౌన్సిల్ తరపు న్యాయవాది ఆర్కే కపూర్ భిన్నమైన వాదన వినిపించారు. భార్య తన అహాన్ని సంతృప్తి పరచడానికి భర్తపై వైవాహిక అత్యాచారం కేసు పెట్టాలని బలవంతం చేయలేదని స్పష్టం చేశారు. వైవాహిక సంబంధంలో భార్యాభర్తల మధ్య జరిగే లైంగిక సంపర్కాన్ని అత్యాచారంగా పేర్కొనలేమమన్నారు. ఒక వేళ భార్య అనుమతి లేకుండా చేస్తే.. అది లైంగిక వేధింపుగా మాత్రమే పిలుస్తామన్నారు.గృహహింస చట్టం 2005 లో దీని గురించి స్పష్టంగా చెప్పామన్నారు.
భారత రేప్ చట్టం ప్రకారం వైవాహిక అత్యాచార ఘటనల్లో భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ ఆర్‌ఐటీ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అనే ఎన్జీవోలు పిటిషన్ దాఖలు చేశాయి. వాటిపై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇతరులతో శృంగారం జరపడానికి దంపతుల మధ్య జరిగే దానికి భిన్నమైన ప్రాతిపదిక ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అమికస్ క్యూరీలుగా నియమితులైన సీనియర్ న్యాయవాదులు రెబెక్కా జాన్ , రాజశేఖర్ రావులు వైవాహిక అత్యాచారం అంశం రాజ్యాంగ విరుద్ధమని మరియు దానిని కొట్టివేయాలని సూచించారు.ఈ అంశంపై 'నిర్మాణాత్మక విధానాన్ని' పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ కేసులో గతంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం, వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించరాదని పేర్కొంది, ఇది వివాహ వ్యవస్థను అస్థిరపరిచే విషయమని చెప్పింది. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.