రోడ్డు ప్రమాదంలో ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ మృతి, సైక్లింగ్ చేస్తుండగా ఢీకొట్టిన కార్
Avtar Saini Death: ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Intel India Ex Chief Avtar Saini Death: ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఓ టౌన్‌షిప్‌లో సైక్లింగ్ చేస్తుండగా ఓ క్యాబ్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 5.50 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. నెరూల్ ఏరియాలో పామ్ బీచ్ రోడ్‌లో తన స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తుండగా క్యాబ్ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడికక్కడే పడిపోయిన అవతార్ సైనీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చెంబూర్‌లో ఉంటున్నారు. Intel 386,486 మైక్రోప్రాసెసర్స్ తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెంటియమ్ ప్రాసెసర్ డిజైన్ తయారీలోనూ ఆయన పని చేశారు. క్యాబ్ డ్రైవర్‌పై పోలీసులు FIR నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు.మిగతా సైక్లిస్ట్‌లు ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమయ్యారు. క్యాబ్ డ్రైవర్‌ని పోలీసులకు అప్పగించారు. మూడేళ్ల క్రితం అవతార్ సైనీ భార్య చనిపోయారు. అప్పటి నుంచి ఆయన ఒక్కరే ఉంటున్నారు. కూతురు, కొడుకు అమెరికాలో ఉంటున్నారు. వచ్చే నెల సైనీ కూడా అమెరికాకి వెళ్లాల్సి ఉంది. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ గోకుల్ వి సుబ్రహ్మణ్యం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఇంటెల్‌కి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. 1982 నుంచి 2004 మధ్య కాలంలో అవతార్ సైనీ ఇంటెల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
"ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ మృతి మాకెంతో విచారం కలిగించింది. భారత్‌లో ఇంటెల్ R&D సెంటర్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. కంపెనీకి ఎన్నో విలువైన సలహాలు అందించిన ఆయన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం"
- గోకుల్ వి సుబ్రహ్మణ్యం, ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్