ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది, 45 ఏళ్ల రికార్డుని చెరిపేసిన వరదలు
Delhi Floods: ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతోంది.
Delhi Floods:
ఉప్పొంగుతున్న యమున
ఢిల్లీలోని భారీ వర్షాలకు యమునా నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతోంది. భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్నత స్థాయిలో కీలక భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై జోక్యం చేసుకుని సాయం అందించాలని ఇప్పటికే కేజ్రీవాల్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది. 45 ఏళ్ల తరవాత ఈ స్థాయిలో నీటి మట్టం పెరగడం ఇదే తొలిసారి. 1978లో కురిసిన వర్షాలకు యమునా నది నీటి మట్టం 204.79 మీటర్లకు చేరుకుంది. ఇప్పుడా రికార్డు బద్దలైపోయింది. అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు పోటెత్తి ఇళ్లలోకి రాకుండా కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తున్న ఢిల్లీ ప్రజలు 45 ఏళ్ల క్రితం ముంచెత్తిన వరదల్ని గుర్తు చేసుకుంటున్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal, says "The water level of the Yamuna River in Delhi has reached 207.71 metres, which is the highest ever. Delhi has not received rainfall in the last 2-3 days. Water is entering Delhi from Himachal Pradesh and Haryana. Regarding this, I have also… pic.twitter.com/wPUZk7XO3u
— ANI (@ANI) July 12, 2023
1978లో ఏం జరిగింది..?
45 ఏళ్ల క్రితం ఢిల్లీలో యమునా నది పోటెత్తింది. వరదల ధాటిని తట్టుకోలేక యమునా నదిలోకి 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా నీటి మట్టం 204 మీటర్లకు పెరిగింది. ఆ తరవాత బీభత్సం సృష్టించింది. 2013లోనూ యమునా నది ఇదే విధంగా ఉప్పొంగింది. అయితే...అప్పటికే వరద నీటిని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం వల్ల చాలా వరకూ ప్రభావాన్ని తగ్గించగలిగారు. కొన్నేళ్లుగా ఈ వరదల ధాటి పెరుగుతూ వస్తోంది. లక్షలాది మందిపై ప్రభావం పడుతోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. దాదాపు 43 చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నాశనమయ్యాయి. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 1978లో 207 మార్క్ దాటింది యమునా నది. ఆ తరవాత 2010లో 207.11, 2013లో 207.32 మీటర్లకు చేరుకుంది. ఈ సారి రికార్డు స్థాయిలో 207.55 మీటర్లకు పెరిగింది. అటు నోయిడా కూడా వరదల ధాటికి అల్లాడిపోతోంది. ఇప్పటికే సహాయక శిబిరాలు ఏర్పాటయ్యాయి. చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందిగా ఉంది. గ్రామాలకు వెళ్లేందుకు దారులులేకుండా పోయాయి. కొన్ని చోట్ల సరుకులు నిండుకుంటున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కలరా లాంటి వ్యాధులూ సోకే ప్రమాదముంది.
Also Read: North India Floods: ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు, కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు