World Press Freedom Index: పత్రికా స్వేచ్ఛ సూచీలో మరింత దిగజారిన భారత్, 180 దేశాల్లో 161వ స్థానం
World Press Freedom Index: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే పత్రికా వ్యవస్థ క్రమంగా స్వేచ్ఛను కోల్పోతోంది. తాజాగా విడుదలైన నివేదికలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
Press Freedom Index: ప్రజాస్వామ్యంలో పాత్రికేయ రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక భాగాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల తరువాత నాలుగో స్థానం మీడియాకే ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో `మీడియా`ది అత్యంత బాధ్యతాయుత పాత్ర. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్‌లో మాత్రం `పత్రికా స్వేచ్ఛ` నామమాత్రంగా ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సూచీ నివేదికలో వెల్లడైంది. ప్రతీ సంవత్సరం ప్రఖ్యాత 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' (RSF- రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్) సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని పత్రికాస్వేచ్ఛపై నివేదిక విడుదల చేస్తుంది.
బుధవారం (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా, గ్లోబల్ మీడియా మానిటరింగ్ ఆర్గనైజేషన్ 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' (RSF- రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్) తన వార్షిక నివేదికను ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో పత్రికా స్వేచ్ఛపై నివేదికలను ప్రచురిస్తుంది. కాగా.. ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో ఆ నివేదికలో భారత్ స్థానంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక ప్రకారం, 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం 11 స్థానాలు దిగజారి 161వ ర్యాంక్‌కు చేరుకుంది.
గతేడాది 150వ స్థానంలో భారత్
గతేడాది ఆర్‌ఎస్‌ఎఫ్ 180 దేశాల్లో జరిపిన సర్వేలో భారత్‌కు 150వ స్థానం లభించింది. ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక ప్రకారం, “తజికిస్థాన్ (ఒక స్థానం దిగజారి 153వ ర్యాంక్), భారత్ (11 స్థానాలు దిగజారి 161వ ర్యాంక్), టర్కీ (16 స్థానాలు దిగజారి 165వ ర్యాంక్) దేశాల్లో పరిస్థితి ‘సమస్యాత్మకం’ నుంచి ‘చాలా పేలవమైనది’గా మారింది. "సమాచార స్వేచ్ఛా ప్రవాహాన్ని ప్రమాదకరంగా నియంత్రించే పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే మీడియా సంస్థలు వారికి లొంగిపోతున్నాయి.'' అని నివేదిక పేర్కొంది.
మీడియా సంస్థల ఆందోళన
ఆర్‌ఎస్‌ఎఫ్ ఇండెక్స్‌లో దేశ ర్యాంక్ క్షీణించడంపై భారతీయ మహిళా ప్రెస్ కార్ప్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తాజా ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక ప్రకారం 'భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛ సూచీ మరింత దిగజారింది’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది.
“గ్లోబల్ సౌత్‌లో ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో, అసమానతలు ఎక్కువగా ఉన్న చోట, మీడియా పాత్రను తక్కువ అంచనా వేయలేము. అదేవిధంగా, కాంట్రాక్టు పునరుద్ధరణ వంటి అస్థిరమైన పని పరిస్థితులు కూడా పత్రికా స్వేచ్ఛకు సవాళ్లే. అసురక్షిత పని పరిస్థితులు పత్రికా స్వేచ్ఛకు ఎప్పటికీ దోహదపడవు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
సిగ్గుతో తలదించుకోవాలి: శశి థరూర్
పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంక్ క్షీణించడంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. "మనమందరం సిగ్గుతో తల దించుకోవలసిన సమయం: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలలో భారతదేశం 161వ స్థానంలో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.