Workers Killed Dhaba Owner: దీపావళి బోనస్ ఇవ్వలేదని యజమాని హత్య - నాగ్ పూర్ లో దారుణ ఘటన
Maharastra News: దీపావళి పండుగ వేళ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఘోరం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు డాబా వర్కర్లు దారుణానికి పాల్పడ్డారు.
Wokers Killed Dhaba Owner For Not Giving Bonus: దీపావళి (Diwali) పండుగ వేళ మహారాష్ట్ర (Maharashtra)లోని నాగపూర్ లో ఘోరం జరిగింది. పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వలేదన్న కారణంతో దాబా యజమానిని ఇద్దరు వర్కర్లు దారుణంగా హతమార్చారు. నాగపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా సమీపంలో మాజీ సర్పంచ్ రాజు ధెంగ్రే దాబా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మండ్లాకు చెందిన ఛోటు, ఆది దాబాలో పని చేస్తున్నారు. తమకు దీపావళి బోనస్ కావాలని అడగ్గా, యజమాని నిరాకరించాడు. దీంతో పగ పెంచుకుని అతన్ని దారుణంగా చంపేశారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తలపై బండరాయితో కొట్టి
అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో యజమానిని హతమార్చాలని ఛోటు, ఆది కుట్ర పన్నారు. శుక్రవారం రాత్రి భోజనం అయ్యాక యజమాని ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో, అతడి మెడకు తాడు బిగించి తలపై బండరాయితో కొట్టారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసి అతడి ముఖాన్ని గుర్తు పట్టలేని విధంగా ఛిద్రం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం మృతదేహాన్ని ఓ బొంతలో కప్పేశారు. అనంతరం యజమాని కారులోనే నిందితులిద్దరూ పరారయ్యారు. విహార్ గావ్ సమీపంలోని నాగ్‌పుర్ - ఉమ్రెడ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. దీంతో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. దాదాపు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరినీ రాజు ధెంగ్రే తన ధాబాలో వర్కర్లుగా చేర్చుకున్నట్లు తెలుస్తోంది.
కుమార్తెకు అనుమానం రావడంతో
దాబా యజమాని ధెంగ్రే కుమార్తె తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. పక్కనే ఉన్న పాన్ దుకాణం నిర్వాహకుడికి ఫోన్ చేసింది. అతడు అక్కడికి వెళ్లి చూసేసరికి ధెంగ్రే రక్తపుమడుగులో కనిపించాడు. విషయాన్ని ధెంగ్రే కుమార్తెకు చేరవేశాడు. ఈ దారుణానికి ఆర్థికపరమైన వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు మాజీ సర్పంచ్, స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణం ఏమైనా ఉందా ? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
దాబాకు నిప్పు పెట్టిన తాగుబోతులు
కాగా, నాగపూర్ లో కొన్ని నెలల క్రితం తినడానికి చికెన్ అడిగితే లేదన్నాడన్న కోపంతో దాబాను తగులబెట్టారు ఇద్దరు తాగుబోతులు. శంకర్ తైదే, సాగర్ పాటెల్‌లు రాత్రి ఒంటి గంట సమయంలో నాగ్‌పూర్, బెల్‌ట్రోడీలోని ఓ దాబాకు వెళ్లారు. చికెన్ ఆర్డర్ చేశారు. అయితే దాబాలో చికెన్ లేకపోవటంతో అదే విషయాన్ని తాగుబోతులకు చెప్పాడు యజమాని. దీంతో వారిద్దరూ అతనితో వాగ్వాదానికి దిగారు. అనంతరం దాబాకు నిప్పంటించారు. యజమాని కళ్లముందే అది కాలి బూడిదైంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.