Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ల అమలు కేంద్రానికి కష్టమేం కాదు, మరి వాయిదా ఎందుకు - కాంగ్రెస్
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లను అమలు చేయడాన్ని కేంద్ర సర్కారు 2031కి వాయిదా వేయడం వెనక ఆంతర్యం ఏమిటని మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు.
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యంపై కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కబీర్ ప్రసిద్ధ కోట్ ను ఉంటంకిస్తూ.. కేంద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇవాళ రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రెండు సభల్లోనూ ఆమోదం పొంది, చట్టం కావడం ఏమంత కష్టం కాదు. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడానికి జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ అవసరమని, ఆ తర్వాతే ఈ నారీ శక్తి వందనం చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ఈ బిల్లు గురించి చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ ఏమంత కష్టం కాదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఇప్పుడే అమలు చేయవచ్చని అన్నారు. కానీ 2031 వరకు వాయిదా వేశారని, దాని వెనక ఆంతర్యం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. పంచాయతీత ఎన్నికలు, జిల్లా పంచాయతీ ఎన్నికలు(మహిళలకు) రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారోనని ఖర్గే ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కబీర్ కవిత చెప్పారు మల్లిఖార్జున ఖర్గే. 'కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్..'(రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేయండి.. ఈరోజే చేయాల్సిన పనిని ఇప్పుడే చేయండి) అని ఖర్గే చెప్పుకొచ్చారు.
ఖర్గే ప్రశ్నలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బదులిచ్చారు. మహిళా రిజర్వేషన్లు తీసుకురావడం వెనక బీజేపీ ఉద్దేశం పాయింట్లు సాధించడం లేదా రాజకీయ లబ్ది పొందడం కాదని జేపీ నడ్డా అన్నారు. మహిళల కోసం ఈ బిల్లును అమలు చేయాలని అనుకుంటన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని అనుసరించి సరైన మార్గంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని నడ్డా బదులిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేందుకు కేంద్రం వడివిడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జనాభా గణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేందుకు జనాభా గణన చేట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా ప్రకటించారు. బిల్లు అమలులో జాప్యం జరుగుతుందనే భయాందోళనలు అవసరం లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం డీలిమిటేషన్‌ను చేపడుతుందని ఆయన చెప్పారు.
నిష్పక్షపాతంగా సీట్ల కేటాయింపు
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును వ్యతిరేకిస్తున్న వారిపై అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టారు. ఖచ్చితంగా 1/3 వంతు సీట్లు మహిళా ఎంపీలకు రిజర్వ్ చేయబడతాయని, నిష్పక్షపాతంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఓబీసీలు, ముస్లింలకు రిజర్వేషన్లు లేనందున ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారని, మీరు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే రిజర్వేషన్లు త్వరగా వస్తాయా? అంటూ ప్రశ్నించారు. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా రిజర్వేషన్ల అమలుకు గ్యారంటీ ఉంటుందని అన్నారు.