Women and Men in India 2022: విద్య, వైద్యంలో దూసుకెళ్తున్న మహిళలు- పీహెచ్‌డీల్లో మాత్రం పురుషులదే పైచేయి
అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఇప్పటివరకూ పురుషులే ఆధిపత్యం వహించిన కొన్ని కోర్సులు, వృత్తుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగి ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.
Women and Men in India 2022: అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. వారితో సమానంగా అవకాశాలు దక్కించుకుని తామేమీ తక్కువ కాదని చెబుతున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న అతివలు ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దుగా విజయాలు సాధిస్తామని నిరూపిస్తున్నారు. ఇప్పటివరకూ పురుషులే ఆధిపత్యం వహించిన కొన్ని కోర్సులు, వృత్తుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగి ఆయా రంగాల్లో వారు తమదైన ముద్ర వేస్తున్నారు.
మనదేశంలో ప్రాథమిక పాఠశాల్లో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుష టీచర్లతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయులు 126 మంది ఉన్నారు. అంతేకాకుండా వైద్యం, సైన్స్ డిగ్రీ కోర్సుల్లోనూ వారు దూసుకెళుతున్నారు. అయితే.. ఐటీ, ఇంజినీరింగ్ డిగ్రీల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య.. అబ్బాయిల కంటే తక్కువగా నమోదవుతోంది. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘భారతదేశంలో పురుషులు-మహిళలు-2022’ పేరుతో ఈ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక.. అనేక రంగాల్లో అమ్మాయిలు, అబ్బాయిల పురోగతిని వివరించింది.
2020-21 విద్యా సంవత్సరంలో మొత్తం 45.80 లక్షల మంది పీజీ డిగ్రీ కోర్సుల్లో చేరగా వీరిలో అమ్మాయిలే 25.83 లక్షల మంది ఉన్నారు. అబ్బాయిలు ఎక్కువ శాతం డిగ్రీతో చదువుకు పుల్ స్టాప్ పెడుతుండగా.. అమ్మాయిలు ఎక్కువగా పీజీలో చేరుతున్నారు. పీహెచ్‌డీల విషయంలో మాత్రం అబ్బాయిలే ముందంజలో ఉంటున్నారని.. దేశంలో చదువుతో సంబంధం లేకుండా 82 శాతం మంది మహిళలు ఇంటి పనులు రోజుకు 5 గంటలపైనే చేస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 60 ఏళ్లు దాటాకే పురుషులు ఇంటి పనుల్లో సాయపడుతున్నారని వెల్లడించింది.
దేశంలో 2020-21 నాటికి 25 ఏళ్లకు పైగా వయసున్న పురుషుల్లో కనీసం సెకండరీ స్థాయి విద్యనభ్యసించినవారు 60 శాతం మందే ఉన్నారని గణాంకాల మంత్రిత్వ శాఖ అధ్యయనంలో తేలింది. 2020-21లో దేశవ్యాప్తంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారి సంఖ్యను పరిశీలిస్తే ఆకర్షణీయమైన జీతాలు లభించే ఐటీ, కంప్యూటర్ డిగ్రీ కోర్సుల్లో 5.33 లక్షల మంది అబ్బాయిలు ఉంటే 3.44 లక్షల మందే అమ్మాయిలున్నారు. ఎంబీబీఎస్, ఎండీ, ఆయుర్వేద, హోమియో డిగ్రీల్లో అమ్మాయిలే ఎక్కువగా చేరుతున్నారు. వారే ఈ వృత్తి, ఉద్యోగాల్లో ఎక్కువమంది ఉన్నారు. మొత్తం వైద్య కోర్సుల్లో 6.32 లక్షల మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు 8.94 లక్షల మంది ఉన్నట్టు కేంద్ర నివేదిక పేర్కొంది.
ఇక మేనేజ్‌మెంట్ డిగ్రీలో 5.16 లక్షల మంది అబ్బాయిలు ఉంటే.. 2.98 లక్షల మంది అమ్మాయిలున్నారు. న్యాయవిద్యలో 3.16 లక్షల అబ్బాయిలు, 1.61 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. విదేశీ భాషలను నేర్చుకునే డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలే 18 వేల మంది ఎక్కువగా ఉన్నారు. వ్యాయామ విద్యా డిగ్రీ కాలేజీల్లో 44,907 మంది బాలురుండగా.. 19,190 మంది మాత్రమే అమ్మాయిలున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది.