Whatsapp Recovery: వాట్సప్ సేవలు పునరుద్ధరణ, 2 గంటల తర్వాత మళ్లీ అందుబాటులోకి
దాదాపు రెండు గంటలపాటు ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం సుమారు 12.30 గంటల నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
నేడు (అక్టోబరు 25) మధ్యాహ్నం ఉన్నట్టుండి నిలిచిపోయిన వాట్సప్ మళ్లీ పని చేస్తోంది. దాదాపు రెండు గంటలపాటు ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం సుమారు 12.30 గంటల నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 2.15 గంటల నుంచి పునరుద్ధరించారు. తొలుత మొబైల్ వాట్సప్ యాప్‌లు పని చేయడం ప్రారంభించగా, తర్వాత వాట్సప్ వెబ్ కూడా అందుబాటులోకి వచ్చింది.
#UPDATE: #WhatsApp services have resumed after over an hour of outage pic.twitter.com/ggIkHO1mKo
— ANI (@ANI) October 25, 2022
వాట్సాప్‌కు వచ్చిన సమస్య ఏంటి?
వాట్సాప్ నిలిచిపోయిన సమస్య ఒక్క ఇండియాకే పరిమితం కాలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సర్వర్లలో వచ్చిన సమస్య కారణంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్లుగా మెటా కూడా అధికారికంగా ధృవీకరించింది. వీలైనంత త్వరగా సేవలు పునంప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే సమస్యకు కారణం ఏమిటో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా. ఫేస్ బుక్ కూడా ఈ సంస్థదే. వాట్సాప్ సేవలను ఇటీవల కొన్ని వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్‌లలో కొన్ని వెర్షన్లకు వాట్సాప్ నిలిపివేశారు. ఆ ప్రక్రియలో జరిగిన తప్పుల వల్ల.. మొత్తం వాట్సాప్ సర్వీస్‌కే ఇబ్బంది కలిగిందన్న వాదన వినిపిస్తోంది. అయితే మెటా సంస్థ వరకు ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
వాట్సప్ గురించి ఆసక్తికర విషయాలు ఇవీ
దేశ వ్యాప్తంగా వాట్సప్‌కు 50 కోట్ల డౌన్ లోడ్స్ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వాట్సప్ వినియోగదారులు ఉన్నారు. రోజుకు సరాసరిన 10 వేల కోట్ల మెసేజ్ ల వరకూ సెండ్ అవుతున్నాయి. 80 దేశాల్లో వాట్సప్ కు యూజర్లు ఉన్నారు. వాట్సప్ ద్వారా నిమిషానికి 2.9 కోట్ల మెసేజ్ లు సెండ్ అవుతున్నాయి. వాట్సప్ లో ప్రతి రోజూ 5 కోట్ల 5 లక్షలకు పైగా వీడియో కాల్స్ జరుగుతున్నాయి. యూజర్లు ప్రతి రోజూ సగటున 23 సార్లు వాట్సప్ ఓపెన్ చేస్తుంటారు. అలాగే ప్రతి రోజూ వాట్సప్ కు సగటున 10 లక్షలకు పైగా కొత్త యూజర్లు వస్తున్నారు.
సేవలు ఆగగానే మొదలైపోయిన మీమ్స్
వాట్సప్ సేవలు నిలిచిపోగానే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారు ఒక్క సారిగా ట్విటర్ వేదికగా ట్రోలింగ్ ప్రారంభించారు. వాట్సాప్ పని చేయకపోవడంతో మొదటగా అందరూ తమ నెట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఉంటారు. వైఫై ఎందుకు పోయిందో అని ప్రోవైడర్‌ను తిట్టుకొని ఉంటారు. దాన్ని చాటుతూ చేసిన మీమ్ అందర్నీ నవ్విస్తోంది. వాట్సప్ ఆగిపోగానే భవనంలో అందరూ బాల్కనీలోకి వచ్చేయడం, జనమంతా మూకుమ్మడి ట్విటర్ వైపు పరుగులు తీస్తున్నట్లుగా నెటిజన్లు మీమ్స్ రూపొందించారు.