WB Panchayat Polls: పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు సరైనదే, బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్
WB Panchayat Polls: పశ్చిమ బెంగాల్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికల వేళ కేంద్ర బలగాల మోహరింపుపై దీదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
WB Panchayat Polls: పంచాయతీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్న సందర్భంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచయాతీ ఎన్నికలకు కేంద్ర బలగాలు మోహరించాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీం తలుపు తట్టాయి. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ లో తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. జూన్ 13వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఆదేశించింది. 48 గంటల్లో పారామిలటరీ బలగాలను మోహరించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బెంగాల్ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.
పూర్తిస్థాయి భద్రత కల్పిస్తాం - పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితిపై సుప్రీం కోర్టు ప్రశ్నించగా.. పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. జులై 8వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని చోట్ల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. 189 సమస్యాత్మక బూత్ లలో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తామని వాదనలు వినిపించారు.
'అలా అయితే నిష్పక్షపాత ఎన్నికల ప్రశ్నే తలెత్తదు'
2013, 2018 ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల చరిత్రను దృష్టిలో ఉంచుకని కలకత్తా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిందని సుప్రీం కోర్టు పేర్కొంది. హింసాత్మక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించరాదని, ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలని వ్యాఖ్యానించింది. నామినేషన్ పత్రాలు వేసే స్వేచ్ఛ కూడా లేకపోతే, హత్యలు చేస్తుంటే.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్న ప్రశ్నే తలెత్తదని పేర్కొంది.
ఎన్నికల ప్రకటన నుంచి చెలరేగిన హింస
పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి కూచ్ బెహార్ జిల్లాలో శనివారం ఓ బీజేపీ కార్యకర్త శవమై కనిపించారు. అలాగే మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ హింసాత్మక సంఘటనలు వాస్తవమేనని, సామాన్యులు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలుగా రాజ్ భవన్ లో పీస్ రూమ్ ఏర్పాటు చేసినట్లు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తెలిపారు. రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్ లో ఇటీవల బాంబు దాడి జరిగింది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలో మీటరు దూరంలోనే గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) కు చెందిన ఓ స్థానిక ఎమ్మెల్యే ఒకరు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బాంగర్ లో హింస చెలరేగింది.
https://t.me/abpdesamofficial