UP Crime News: అత్తారింటికి వెళ్తుండగా వధువు జంప్ - మత్తు దిగాక బోరుమన్న వరుడు!
UP Crime News: పెళ్లి చేసుకుని మొదటిసారి అత్తారింటికి వెళ్తున్న ఓ యువతి మధ్యలోనే ప్రియుడితో కలిసి పారిపోయింది. అంతే కాదండోయ్ అత్తామామలు, భర్తకు మత్తు మందు ఇచ్చి మరీ లవర్ తో చెక్కేసింది.
UP Crime News: ఎన్నెన్నో ఆశలతో అతడు సంతోషంగా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా అతడితో పెళ్లికి ఒప్పుకుంది. కానీ పెళ్లై అత్తారింటికి వెళ్లేటప్పుడు మాత్రం ఎవరూ ఊహించని పని చేసింది. భర్త, అత్తమామలు తినబోయే స్నాక్స్ లో మత్తు మందు కలిపింది. అవి తిన్న వారు స్పృహ తప్పి పడిపోగానే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వారు మత్తులోంచి బయటకు వచ్చే సరికి కోడలు కనిపించకపోవడం తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
రాజస్థాన్ కు చెందిన శాంతి లాల్ అనే వ్యక్తి తన మేనల్లుడికి ఎవరో ఒక అమ్మాయితో వివాహం చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆయన తాత చనిపోవడం.. అస్తికలను గంగలో కలిపేందుకు వెళ్తుండగా.. ఓ కుటుంబం పరిచయం అయింది. ఈ క్రమంలోనే శాంతి లాల్ తన మేనల్లుడి ఫొటోను చూపించగా వారు ఓకే చెప్పారు. ఇలా సంబంధం ఖాయం చేసుకున్నారు. అయితే పెళ్లి యూపీలోని పెట్టుకుందామని అమ్మాయి తరఫు వాళ్లు చెప్పడంతో... శాంతిలాల్ తన బావ కన్హయ, అతని భార్య స్నేహలత, పెళ్లి కుమారుడు అంకిత్ తో కలిసి రాజస్థాన్ లోని అమ్మాయి ఇంటికి వెళ్లారు.
స్నాక్స్ లో మత్తు మందు కలిపి పెట్టిన నవవధువు
మొగల్ సారయ్ లో యువతితో అంకిత్ కు వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం అంటే ఫిబ్రవరి 6వ తేదీన వీరంతా కోడలిని తీసుకొని వారణాసి నుంచి జైపూర్ వెళ్తున్న మరుధర్ రైలులో స్వస్థలానికి బయలు దేరారు. ఈ క్రమంలోనే వారు కూర్చున్న చోటుకు ఓ యువకుడు వచ్చి తాను వధువు స్నేహితుడినంటూ పరిచయం చేసుకున్నాడు. కాసేపు అలా అంతా మాట్లాడుకున్నారు. అయితే ముందుగానే మత్తు మందు కలిపిన స్నాక్స్ వెంట తెచ్చుకున్న నవవధువు వాటిని అత్తామామలు, భర్త సహా శాంతిలాల్ కు కూడా ఇచ్చింది. వారంతా అవి తిని మత్తులోకి జారుకోగానే... ముందుగానే అక్కడకు వచ్చి కూర్చున్న తన ప్రియుడితో పారిపోయింది.
మత్తు నుంచి భర్త, అత్తమామలు బయటపడ్డాక కోడలు కనిపించకపోవడం, ఆ పక్కనే ఉన్న మరో స్నేహితుడు కూడా కనిపించకపోవడంతో వారికి తాము మోసపోయినట్లు అర్థం అయింది. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇష్టం లేకుండా అమ్మాయికి పెళ్లి చేయడం వల్లే ఇలా పారిపోయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనలు.. ఇదే రాష్ట్రంలో!
ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్రం 3 లక్షల రూపాయలు అందజేస్తోంది. ఇటీవల బారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు ఎంపిక చేశారు. కొందరు మహిళల ఖాతాల్లో మొదటి వాయిదా కింద రూ.50,000 చొప్పున జమ చేశారు. ఖాతాల్లో నగదు జమ అవగానే ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో కలిసి వెళ్లిపోయారు. మరోవైపు రెండో విడత డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భార్యల ఖాతాల్లో జమ చేయొద్దని బాధిత భర్తలు అధికారులను కోరుతున్నారు.