Minister Wife's Day Comments: ‘మదర్స్ డే’లాగా భార్యల దినోత్సవం కచ్చితంగా ఉండాలట! ఎందుకో చెప్పిన కేంద్ర మంత్రి
Ramdas Athawale Comments: తల్లి జన్మనిస్తుందని, అయితే భార్య తన భర్తకు మంచి, చెడు సమయాల్లో అండగా నిలుస్తుందని రాందాస్ అథవాలే అన్నారు.
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలతో నిలిచారు. మాతృదినోత్సవం తరహాలోనే ‘వైఫ్స్ డే’ (భార్యల కోసం ప్రత్యేక రోజు) జరుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మే 2న ఏటా జరుపుకునే తరహాలోనే భార్యల కోసం మరో రోజు ఉండాలని అభిప్రాయపడ్డారు. వైఫ్స్ డే ఉండాల్సిన ఆవశ్యకత ఉండాలని అన్నారు.
మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రసంగిస్తూ తల్లి జన్మనిస్తుందని, అయితే భార్య తన భర్తకు మంచి, చెడు సమయాల్లో అండగా నిలుస్తుందని అన్నారు. 'భార్యల దినోత్సవం' జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని మంత్రి అన్నారు. మనం భార్యాభర్తల దినోత్సవాన్ని జరుపుకోవాలని అన్నారు.
గతంలో గో కరోనా గో అంటూ..
ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన గో కరోనా గో అనే వ్యాఖ్యలతో తనలో పాజిటివ్ థింకింగ్ పెరిగిందని గతంలో ఓ సందర్భంలో రాందాస్ అథవాలే అన్నారు. ఇలా గో కరోనా, గో కరోనా అని అథవాలే అనడం.. అప్పట్లో చాలా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే అథవాలేకు కరోనా వచ్చింది.
రాందాస్ అథవాలే మరో సందర్భంలో రాజ్యసభలో కరోనాపై ప్రసంగిస్తూ, కరోనాపై కవిత్వం చెప్పారు. ఆ కవిత్వ సారాంశం ఇదీ. ‘‘మహమ్మారి వచ్చిందని, అప్పుడు ప్రపంచ ప్రజలు మేల్కొన్నారని అన్నారు. పల్లెటూరి స్త్రీలు ఇబ్బంది పడ్డారు, కరోనా నాకు కూడా వచ్చింది, ఒప్పుకోవడం నా వంతు. దేశం మొత్తం చప్పట్లు కొట్టింది కానీ మీరు మోదీజీని తిట్టారు. ఆ రాత్రి కరోనా చాలా చీకటిగా ఉంది, అప్పుడు మీరు మా ప్రభుత్వాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు. కరోనాకు భయపడవద్దు, కరోనాను వేగంగా చంపవద్దు, కరోనాను నాశనం చేయవద్దు.’’ అంటూ కవిత్వం చెప్పారు.
అథవాలే ప్రకటనలు కాస్త భిన్నం
రాందాస్ అథవాలే చేసే ప్రకటనలు తరచూ వార్తల ముఖ్యాంశాలు అవుతాయి. సభలో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆయన తన పద్యం లేదా కవిత చదవకుండా ప్రసంగాన్ని ముగించరు. అంతకుముందు, కరోనా కాలంలో దానిపై కవిత్వం చెప్పడం ద్వారా చాలా మందిని ఆకర్షించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు రాందాస్ అథవాలే తన మద్దతుదారులతో కలిసి 'గో కరోనా గో' పాడి అందరి దృష్టిని ఆకర్షించారు.