Union Cabinet Meeting Decisions: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి రూ.3,760 కోట్లు - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే
Union Cabinet Decisions: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటుకు రూ.3,760 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
Union Cabinet Decisions:
దేశంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటుకు రూ.3,760 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (Viability Gap Funding)కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మొత్తం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. అంతకుముందు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యారు.
పునరుత్పాదక ఇంధనం, నాన్-ఫాసిల్ ఇంధన వనరుల ద్వారా దేశంలోని 50 శాతం ఇంధన అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రకారం.. ఇందుకు సంబంధించి 2030-31 వరకు ఐదు విడతలుగా నిధులను విడుదల చేసి, తద్వారా 4,000 మెగావాట్ల గంటల స్టోరేజీ చేయడానికి దోహదం చేస్తుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా రూ.9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
2030-31 వరకు ఐదు విడతలుగా వీజీఎఫ్ కోసం కేంద్ర 100 శాతం గ్రాంట్‌గా ఇవ్వనుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం భావిస్తోంది. . BESS కోసం చేపట్టనున్న వీజీఎఫ్ ప్రాజెక్ట్ మూలధన వ్యయంలో 40 శాతం కేటాయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ స్కీమ్, 2017 ప్రకారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు అవసరమైన అదనపు నిధులు రూ. 1,164 కోట్ల చెల్లింపులను మంత్రివర్గం ఆమోదించింది.
2028-29 వరకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పథకం కింద మిగతా పనులు పూర్తి చేయడానికి అదనపు ఫండ్ అవసరం అని కేబినెట్ చర్చించింది. ఇందుకోసం రూ. 131.90 కోట్ల వ్యయం అవుతుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కోసం కేంద్ర రంగ పారిశ్రామిక అభివృద్ధి పథకం 2017 (IDS, 2017) కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2028- 2029 వరకు ఈ పథకం కింద రూ. 1,164.53 కోట్ల అదనపు నిధులు అవసరం అని మంత్రి మండలి చర్చించింది. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పథకం కింద 774 యూనిట్లు నమోదయ్యాయని, అదనపు నిధులు వారికి అందజేయనున్నామని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం కంపెనీలకు ప్రభుత్వం ఈ పథకం కింద అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ ప్రోత్సాహకాలను క్రెడిట్, బీమా రూపంలో అందించనున్నట్లు సమాచారం.